Electricity Board: రాష్ట్రంలో విద్యుత్ కోతలుండవ్...

ABN , First Publish Date - 2022-08-20T13:14:04+05:30 IST

బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలుకు కేంద్రప్రభుత్వం బ్రేకులు వేసినా రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్‌ కోతలు ఉండబోవని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు

Electricity Board: రాష్ట్రంలో విద్యుత్ కోతలుండవ్...

- ఇప్పటికే కేంద్రానికి రూ.700 కోట్లు చెల్లించాం

- ఇక చెల్లించాల్సింది రూ.226 కోట్లే

- టీఎన్‌ఈబీ ప్రకటన


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 19: బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలుకు కేంద్రప్రభుత్వం బ్రేకులు వేసినా రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్‌ కోతలు ఉండబోవని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు (టీఎన్‌ఈబీ) స్పష్టం చేసింది. కరెంటు కొనుగోళ్ల బకాయిలను విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సకాలంలో తీర్చకపోవడంతో బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేయకుండా తమిళనాడు(Tamil Nadu) సహా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కంలను కేంద్రం నిషేధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇండియన్‌ ఎలక్ట్రిసిటి ఎక్స్చేంజ్‌ ద్వారా మార్కెట్‌ నుంచి కరెంటు కొనుగోలు చేసేందుకు వీలులేదని సదరు రాష్ట్రాలకు జారీచేసిన నోటీసులో కేంద్రం పేర్కొంది. దీంతో గురువారం రాత్రి నుంచి సొంతంగా ఉత్పత్తి చేసుకున్న విద్యుత్‌, వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న విద్యుత్‌ మినహా రోజువారీ డిమాండ్‌ మేరకు అప్పటికప్పుడు బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. కేంద్రం లెక్కల ప్రకారం, తమిళనాడు రూ.924 కోట్లు బకాయి పడింది. దీర్ఘకాలంగా ఈ బకాయి చెల్లించని కారణంగా విద్యుత్‌ కొనుగోలుకు నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో, తాజా లెక్కలు అప్‌డేట్‌ కాకపోవడం వల్ల కేంద్రం గురువారం నోటీసులు జారీచేసిందని రాష్ట్ర విద్యుత్‌ అధికారులు(State Electricity Authorities) వివరణ ఇచ్చారు. నోటీసు అందుకున్న వెంటనే కేంద్రప్రభుత్వ రంగ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు ఈ సమాచారం తెలియజేశామని, సమస్య ఒకటీరెండ్రోజుల్లో పరిష్కారమవుతుందని ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలుకు మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, టీఎన్‌ఈబీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో... రాష్ట్రం తరఫున కేంద్రప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.926 కోట్లలో రూ.700 కోట్లు ఇప్పటికే చెల్లించినట్లు స్పష్టం చేసింది. రాష్ట్రం చెల్లించాల్సిన బకాయిలు రూ.226 కోట్లు మాత్రమేనని, విద్యుత్‌ అవసరాలను బట్టి కరెంటు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. కాగా, అక్టోబరు వరకు రాష్ట్రంలో విద్యుత్‌(Electricity) అవసరాలు పెరిగే అవకాశం లేదని, బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి కోతలు ఉండబోవని టీఎన్‌ఈబీ ప్రకటించింది. 

Updated Date - 2022-08-20T13:14:04+05:30 IST