టీఎన్‌సీసీలో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే...

ABN , First Publish Date - 2022-05-07T13:55:32+05:30 IST

తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ)లో తమకు తగిన ప్రాధాన్యం కల్పించాల్సిందేనని తెలుగు నేతలు డిమాండ్‌ చేశారు. స్థానిక అన్నాసాలైలోని కాస్మో పాలిటన్‌ క్లబ్‌లో శుక్రవారం టీఎన్‌సీసీ ప్ర

టీఎన్‌సీసీలో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే...

- తెలుగు నేతల డిమాండ్‌ 

- నగరంలో సమావేశమైన నేతలు


ప్యారీస్‌(చెన్నై): తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ)లో తమకు తగిన ప్రాధాన్యం కల్పించాల్సిందేనని తెలుగు నేతలు డిమాండ్‌ చేశారు. స్థానిక అన్నాసాలైలోని కాస్మో పాలిటన్‌ క్లబ్‌లో శుక్రవారం టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి అధ్యక్షతన తెలుగు నేతల సమావేశం జరిగింది. టీఎన్‌సీసీ మీడియా విభాగం చైర్మన్‌ గోపన్న, ప్రధాన నిర్వాహకులు తాళ్లూరి సురేష్‌, దామోదరన్‌, కీరనూరు రాజేంద్రన్‌, ఎన్‌.రంగభాష్యం, ఇల.భాస్కర్‌, టీకా రామన్‌, శివరామన్‌, ఎస్‌ఏ వాసు, అగరం గోపి, డా.నిర్మల్‌, సత్య, సీఆర్‌ పెరుమాళ్‌, రాజ్‌కుమార్‌, కొండలదాసు, పరంధామన్‌, కౌన్సిలర్‌ జె.ఢిల్లీబాబు, రాజేశ్వరి, ఉమామహేశ్వరి, పి.సురే్‌షబాబు కుంగ్‌ఫూ విజయన్‌, మాజీ కౌన్సిలర్‌ ఎం.నాగరాజు, మద్రాసు హైకోర్టు న్యాయవాది కనకరాజ్‌ సహా 70 మందికి పైగా పాల్గొని తెలుగు నేతలకు తగ్గుతున్న ప్రాధాన్యంపై కూలంకషంగా చర్చించారు. ముందుగా చిరంజీవి మాట్లాడుతూ, టీఎన్‌సీసీకి తెలుగు వారి బలం తెలియడంలేదని, దీనిపై ఏఐసీసీ సమావేశంలో తాను పలుమార్లు చెప్పినా ఫలితం కనిపించలేదన్నారు. టీఎన్‌సీసీలో ఉన్న 26 విభాగాల్లో ఇద్దరు మాత్రమే తెలుగువారున్నారని, అలాగే శాసనసభ్యుల్లో ఒక్కరు కూడా కాంగ్రెస్‌ తరఫున తెలుగు వ్యక్తి లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించి ఉమ్మడి మద్రాసు హయాంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కుమారస్వామి రాజా, రాజారామ్‌ నాయుడు, మునుస్వామి నాయుడు, ఓమందూర్‌ రామస్వామి రెడ్డి తదితరులు తెలుగువారేనని, రాష్ట్రంలో తెలుగువారు అందిస్తున్న సహకారం వల్లే పార్టీ ద్రావిడ పార్టీల మధ్య నిలబడగలుగుతోందని చెప్పారు. సుదర్శనం నాయుడు, ఎస్‌ఆర్‌ బాలసుబ్రమణ్యం, గోపీనాథ్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్లుగా వ్యవహరించారని, వారి తర్వాత తెలుగు వారికి ఈ అవకాశం రాలేదన్నారు. అదే విధంగా తమిళనాడుకు చెందిన ఆరుగురు ఏఐసీసీ సభ్యుల్లో ఒక్కరు కూడా తెలుగు వారు లేరని, దీనిపై పార్టీ అధిష్ఠానం స్పందించి తరతరాలుగా పార్టీ అభివృద్ధి కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తున్న తెలుగు వారికి న్యాయం చేయాలన్నారు. మద్రాసు నుంచి వేలూరు వరకు 40 రోజులు పర్యటించి రాష్ట్ర కాంగ్రెస్ లో సభ్యత్వం కలిగిన కుటుంబాలు, పార్టీ పదవుల్లో ఉన్న నిర్వాహకులు, కార్యకర్తల వివరాలు సేకరిస్తామని, ఈ ప్రక్రియ ప్రతి జిల్లాలో పార్టీలో ఉన్న తెలుగు నాయకులు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏఐసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తెలుగు వ్యక్తి వస్తేనే తెలుగు వారికి పార్టీలో న్యాయం జరుగుతుందని చిరంజీవి తెలిపారు. అనంతరం గోపన్న మాట్లాడుతూ... స్వలాభాపేక్షతో పార్టీలో పనిచేస్తున్న వారి మధ్య చిరంజీవి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సివుందని సూచించారు. చిరంజీవి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు కూడా విస్తరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఎన్‌సీసీ కోశాధికారిగా, సీఎల్పీ లీడర్‌గా ఎనలేని సేవలందించిన దివంగత సుదర్శనం నాయుడు చిత్రపటాన్ని సత్యమూర్తి భవన్‌లో ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశాన్ని చూస్తుంటే టీఎన్‌సీసీ మొత్తం ఇక్కడే ఉన్నట్లు అనిపించిందని చమత్కరించారు. ఎన్‌.రంగభాష్యం మాట్లాడుతూ.. తమిళనాట కాంగ్రె్‌సను కాపాడగలిగే సత్తా ఒక్క తెలుగు వారికే ఉందన్నారు. పార్టీ తరఫున నిర్వహించే పోరాటాల్లో పెద్దసంఖ్యలో పాల్గొనేది కూడా తెలుగువారేనని, అయినప్పటికీ పార్టీ పరంగా కీలక పదవుల్లో తెలుగువారు లేకపోవడం శోచనీయమన్నారు. ఇల.భాస్కర్‌ మాట్లాడుతూ, సత్యమూర్తి భవన్‌లో తెలుగు గొంతుక వినిపించాలని, అందర్నీ చేరదీసే తెలుగు నేతల భవిష్యత్తు ప్రకాశవంతం కావాలన్నారు. శివరామన్‌ మాట్లాడుతూ... తేనె కంటే మధురమైన తెలుగు భాష మాతృభాష కలిగిన వారు తమ న్యాయమైన హక్కుల కోసం చిరంజీవి నేతృత్వంలో గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. మోతీలాల్‌ నెహ్రూ జయంతి రోజున ఈ సమావేశం ఏర్పాటుచేయడం శుభపరిణామమన్నారు. తాళ్లూరి సురేష్‌ మాట్లాడుతూ... తెలుగు వారు ఏ ప్రాంతంలో ఉన్నా అమ్మ భాషలోనే మాట్లాడుకోవాలని, ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు. 2010లో నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో 40 శాతం మంది తెలుగు వారున్నారని, అయినా న్యాయమైన హక్కులు రాబట్టుకోలేకపోతున్నారని, ఇందుకు కారణం ఐక్యత లేకపోవడమేనన్నారు. చిరంజీవి అధ్యక్షతన దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంతో టీఎన్‌సీసీలో కదలిక రావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో 77 మందికి పైగా పాల్గొన్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1,000కి పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కీలానూర్‌ రాజేంద్రన్‌ మాట్లాడుతూ.. రాతి బండలను అద్భుత శిలాఖండాలుగా రూపొందించిన పల్లవ రాజుల మాతృభాష తెలుగేనని, ఘనచరిత్ర కలిగిన తెలుగు కుటుంబంలో పుట్టడం అదృష్టమన్నారు. సీనియర్‌ నేత దామోదరన్‌ మాట్లాడుతూ.. చిరంజీవి, విల్లివాక్కం సురేష్‌, గోపన్న, ఎస్‌ఏ వాసు, రంగభాష్యం తదితర కీలకనేతల ప్రోద్బలంతో నిర్వహించిన ఈ సమావేశం టీఎన్‌సీసీని కదిలిస్తుందని, మనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు.


Read more