Bengaluruలో హిజ్బుల్ ముజాహిద్దీన్ militant అరెస్టు.. ఉలిక్కిపడిన పోలీసు యంత్రాంగం

ABN , First Publish Date - 2022-06-07T21:06:07+05:30 IST

హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఒకరిని కశ్మీర్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర పోలీసులను..

Bengaluruలో హిజ్బుల్ ముజాహిద్దీన్ militant అరెస్టు.. ఉలిక్కిపడిన పోలీసు యంత్రాంగం

బెంగళూరు: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఒకరిని కశ్మీర్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్‌కు చెందిన తాలిబ్ హుస్సేన్ రెండేళ్లుగా బెంగుళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి శ్రీరాంపుర ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. చుట్టుపక్కల వ్యక్తులకు కూడా అనుమానం లేకుండా ఉగ్రవాద సంస్థ తరఫున అతను కార్యకలాపాలను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. జమ్మూకశ్మీర్ పోలీసులు వారం రోజుల క్రితం బెంగళూరు వచ్చి ఈ కేసుకు సంబంధించిన సమాచారం సీనియర్ పోలీసులకు అందించారు. అతని ఇంటిని కనిపెట్టే విషయంలో బెంగళూరు పోలీసుల సాయం తీసుకున్నారు. ఈనెల 3న సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి తాలిబ్ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


పోలీసు ఉన్నతాధికారుల వివరాల ప్రకారం, హుస్సేన్‌కు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఒకామె  జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో ఉంటోంది. మరో ఆమె బెంగళూరులో అతనితో కలిసి ఉంటోంది.  కిష్ట్వార్‌ నివాసి అయిన హుస్సేన్ ఆటో డ్రైవర్‌గా రెండేళ్లుగా బెంగళూరులో ఉంటున్నప్పటికీ అతని గురించిన సమాచారం అతని పొరుగువారికి కానీ, ఇంటి యజమానికి కానీ తెలియదని పోలీసులు చెప్పారు. హుస్సేన్ 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలో చేరి, యువకులను రిక్రూట్ చేస్తూ వచ్చేవాడని పోలీసులు అంటున్నారు.


పోలీసులు హైఅలర్ట్...

బెంగళూరులో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది అరెస్టు కావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఇటీవల కాలంలో హిజాబ్ వివాదం, మసీదు-మందిరం వంటి సున్నితమైన అంశాలతో బెంగళూరు వాతావరణం వేడెక్కుతూ వచ్చింది. భద్రత విషయంలో పోలీసులు సైతం ఎక్కడా రాజీపడకుండా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన హిజ్బుల్ ఉగ్రవాది రెండేళ్లుగా బెంగళూరులోనే ఆటో డ్రైవర్‌గా ఉండటం పోలీసులను మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు సైతం గతంలో బెంగళూరులోనే షెల్టర్ తీసుకున్నారు.

Updated Date - 2022-06-07T21:06:07+05:30 IST