Justice Chandrachud: కరెక్టని సరిపెట్టుకుంటున్నాం అంతే!!

ABN , First Publish Date - 2022-11-21T02:28:00+05:30 IST

ఏదైనా తప్పు చేస్తే దానిని దిద్దుకోవడానికి తప్పనిసరిగా ఆస్కారం ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు.

Justice Chandrachud: కరెక్టని   సరిపెట్టుకుంటున్నాం  అంతే!!

సుప్రీం తీర్పు ఫైనలా, కాదా..? అన్న

మీమాంసపై జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్య

టార్గెట్‌ చేస్తారనే భయంతోనే

బెయిలివ్వడానికి జిల్లా కోర్టుల జంకు

అందుకే హైకోర్టుల్లో పిటిషన్ల వెల్లువ

దిగువ కోర్టుల్లో ఈ భయాన్ని పోగొట్టాలి

అవి కోరల్లేకుండా నిర్వీర్యంగా ఉండకూడదు

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి స్పష్టీకరణ

న్యూఢిల్లీ, నవంబరు 20: ఏదైనా తప్పు చేస్తే దానిని దిద్దుకోవడానికి తప్పనిసరిగా ఆస్కారం ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. మేం సుప్రీంకోర్టు కాబట్టి తప్పులే చేయం అని అనుకోరాదని స్పష్టం చేశారు. ‘సుప్రీంకోర్టు తీర్పు కరెక్టు కాబట్టి అదే ఫైనల్‌ అనుకోవడానికి వీల్లేదు.. సుప్రీంకోర్టే ఫైనల్‌ గనుక కరెక్టు అని సరిపెట్టుకుంటున్నామంతే’ అంటూ ఓ అమెరికన్‌ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను శనివారమిక్కడ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తమను టార్గెట్‌ చేస్తారన్న భయంతోనే జిల్లా కోర్టులు బెయిల్‌ మంజూరుకు వెనకడుగు వేస్తున్నాయని అన్నారు. దీనివల్లే హైకోర్టుల్లో బెయిల్‌ పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ‘దిగువ కోర్టుల జడ్జిలు ఎందుకు బెయిల్‌ మంజూరు చేయడం లేదు? వారికి సామర్థ్యం లేక కాదు.. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల కంటే బాగా వారు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ఆ నేరం జరిగింది కాబట్టి. అయినా వారిలో ఒక భయం. నేను బెయిల్‌ మంజూరుచేస్తే.. ఘోరమైన నేరంలో బెయిలిచ్చానని రేపు నన్ను లక్ష్యంగా చేసుకుంటారని ఆందోళన. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.’ అని తేల్చిచెప్పారు. సామాన్య పౌరులతో సమన్వయానికి జిల్లా న్యాయ వ్యవస్థే తొలి మెట్టన్నారు.

సీఆర్‌పీసీ సెక్షన్‌ 438 కింద ఎవరిపైనైనా కేసు నమోదై.. అరెస్టు ఖాయమని భావిస్తే ముందస్తు బెయిల్‌ కోసం జిల్లా కోర్టునే తొలుత ఆశ్రయిస్తారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లాగే జిల్లా కోర్టులకు కూడా సమ ప్రాధాన్యం ఉందని స్పష్టం చేశారు. కేంద్రం న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు అందించాలని కోరారు. మధ్య వయసు న్యాయవాదులను కాపాడుకునే క్రమంలో బార్‌ అసోసియేషన్‌ కూడా వెలుగు దివిటీని ప్రజ్వలింపజేసిందని ప్రశంసించారు. జిల్లా జడ్జిల్లో గౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్నారు. ‘వారికి తమపై తమకు నమ్మకం లేకపోతే ముఖ్యమైన కేసులో వారు బెయిల్‌ మంజూరు చేస్తారని ఎలా ఆశిస్తాం? ఫలానా ఘోరమైన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయరాదని కొన్ని చట్టనిబంధనలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇలాంటి ఘోర నేరాల్లో కొందరిని ఇరికిస్తుంటారని.. అతిశయోక్తులుగా సమాచారం ఇస్తుంటారని న్యాయమూర్తులుగా మాకు తెలుసు. ఇలాంటి వాటిని ఏరివేయడంలో జిల్లా జడ్జిలదే కీలక పాత్ర. లేదంటే హైకోర్టుల్లో పుంఖానుపుంఖాలుగా బెయిల్‌ పిటిషన్లు పడుతూనే ఉంటాయి’ అని వివరించారు.

Updated Date - 2022-11-21T02:28:00+05:30 IST

Read more