గాలి జనార్దన్‌రెడ్డి కేసులో ఇక రోజూవారీ విచారణ!

ABN , First Publish Date - 2022-09-30T06:44:04+05:30 IST

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు నిందితులుగా ఉన్న ఓబుళాపురం మైనింగ్‌ కుంభకోణం

గాలి జనార్దన్‌రెడ్డి కేసులో ఇక రోజూవారీ విచారణ!

బళ్లారి వెళ్లకుండా మళ్లీ షరతు విధిస్తాం

నేడు ఉత్తర్వులిస్తాం: సుప్రీంకోర్టు

బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘించారు: సీబీఐ

అలాగైతే రద్దు కోరలేదేం: ధర్మాసనం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు నిందితులుగా ఉన్న ఓబుళాపురం మైనింగ్‌ కుంభకోణం కేసులో ఇక రోజూవారీ విచారణకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేస్తామని పేర్కొంది. బెయిల్‌ షరతులను సడలించాలని జనార్దన్‌రెడ్డి  దాఖలు చేసుకున్న పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘రోజూవారీ ట్రయల్‌ జరపాలని ట్రయల్‌ కోర్టును ఆదేశిస్తాం. అక్కడి విచారణ పురోగతి తెలుసుకోడానికి కేసు విచారణను జనవరికి వాయిదా వేస్తాం. సుప్రీంకోర్టు అనుమతితోనే గాలి జనార్దన్‌రెడ్డి బళ్లారి వెళ్లాలన్న నిబంధన పునరుద్ధరిస్తాం. తద్వారా సాక్షులను బెదిరించడం, సాక్ష్యాధారాలను చెరిపివేయడం వంటి అనుమానాలకు తావుండదు. జనవరి వరకు ట్రయల్‌ సాగనివ్వండి. సాక్షులను విచారించనివ్వండి. అప్పుడు బెయిల్‌ షరతు సడలింపుపై నిర్ణయం తీసుకుంటాం’ అని ప్రతిపాదించింది. దీనిపై గాలి జనార్దన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది మీనాక్షి అరోరా స్పందిస్తూ.. ఆయన కుమార్తె రెండ్రోజుల క్రితమే బళ్లారిలో బిడ్డకు జన్మనిచ్చిందని, వాళ్లను చూడడానికి ఆయన వెళ్లాల్సి ఉందని తెలిపారు. అక్కడ ఎన్ని రోజులు ఉంటారని ధర్మాసనం ప్రశ్నించింది. కనీసం రెండు నెలలు ఉండాలనుకుంటున్నారని అరోరా సమాధానమిచ్చారు. అంత సమయమివ్వడం అసాధ్యమని ధర్మాసనం చెప్పడంతో నెల సమయం ఇవ్వాలని అరోరా కోరారు. ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.


సాక్షులను బెదిరించలేదు..

అంతకుముందు మీనాక్షి అరోరా వాదనలు వినిపిస్తూ.. 2015లో బెయిల్‌ పొందినప్పటి నుంచి గతేడాది ఆగస్టు వరకు కోర్టు అనుమతితో జనార్దన్‌రెడ్డి 8 సార్లు మాత్రమే బళ్లారి వెళ్లారని.. నిరుడు ఆగస్టులో బెయిల్‌ షరతులు సడలించాక 17సార్లు వెళ్లారని.. ఎక్కడా ఉత్తర్వులను ఉల్లంఘించలేదని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ‘ట్రయల్‌ కోర్టులో విచారణ జాప్యానికి కారణం ఎవరు? ప్రాసిక్యూషన్‌ మాత్రమే కాదు కదా! నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేయడం, హైకోర్టు నుంచి స్టేలు పొందడం వల్లే కదా ఇదంతా’ అని వ్యాఖ్యానించింది. షరతులను ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దవుతుందని 2015లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవి దివాన్‌ గుర్తుచేశారు. ‘


సాక్షులను బెదిరించవద్దని, సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేయవద్దని.. బళ్లారి, అనంతపురం, కడప జిల్లాలకు ప్రవేశించవద్దని.. విఫలం కాకుండా సీబీఐ కోర్టు విచారణకు హాజరుకావాలని 2015లో సుప్రీంకోర్టు విధించిన షరతులను జనార్దన్‌రెడ్డి ఉల్లంఘించారు’ అని తెలిపారు. ఆయన షరతులను ఉల్లంఘిస్తే.. బెయిల్‌ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించకుండా మిమ్మల్ని ఎవరు నిరోఽధించారని ధర్మాసనం ప్రశ్నించింది. అసలీ విషయంలో మీరు సీరియ్‌సగా ఉన్నారా అని నిలదీసింది. ‘బెయిల్‌ రద్దుకు ఎందుకు అప్లికేషన్‌ దాఖలు చేయలేదు’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - 2022-09-30T06:44:04+05:30 IST