EWS Quota : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-09-08T22:27:21+05:30 IST

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి రిజర్వేషన్లు కల్పిస్తూ భారత ప్రభుత్వం

EWS Quota : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

న్యూఢిల్లీ : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి రిజర్వేషన్లు కల్పిస్తూ భారత ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి తూట్లు పొడుస్తోందా? లేదా? నిర్థరించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మూడు ముఖ్యాంశాలను పరిశీలించాలని నిర్ణయించింది.  ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ఈ వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ (Justice UU Lalit)  నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. 


రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపే మూడు అంశాలు : 


1. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్ల కల్పనతో పాటు ఇతర ప్రత్యేక నిబంధనలను రూపొందించి, అమలు చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనా? 


2. ప్రైవేటు అన్ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను రూపొందించి, అమలు చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనా? 


3. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కోటా పరిధి నుంచి ఎస్ఈబీసీలు/ఓబీసీలు/ఎస్సీలు/ఎస్టీలను మినహాయించడం రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి తూట్లు పొడవడమేనా? అనే ప్రశ్నలపై విచారణ జరిపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 


ఈ పిటిషన్లపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ యూయూలలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్‌బీ పర్దీవాలా, జస్టిస్ బెలా త్రివేది ఉన్నారు. సెప్టెంబరు 13 నుంచి విచారణ ప్రారంభమవుతుందని ఈ ధర్మాసనం తెలిపింది. 


అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ (KK Venugopal) ఈ ప్రశ్నలను సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈడబ్ల్యూఎస్ కోటా (EWS Quota)లో క్రీమీలేయర్ ప్రశ్నే తలెత్తదని తెలిపారు. పేదల్లో నిరుపేదలకు లబ్ధి చేకూర్చాలనేదే దీని లక్ష్యమని చెప్పారు. జస్టిస్ యూయూ లలిత్ మాట్లాడుతూ, ఈ అంశంపై విచారణకు ఈ మూడు ప్రశ్నలు పునాదిగా నిలుస్తాయని తెలిపారు. న్యాయవాదులు వీటిపై తమ వాదనలను వినిపించాలని కోరారు. ఐదు పని దినాల్లో విచారణను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో వాదనలను వినిపించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపారు. 


2019 జనవరిలో 103వ రాజ్యాంగ సవరణ చట్టానికి పార్లమెంటు (Parliament) ఆమోదం లభించింది. రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత దీనిపై అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  ఆర్థిక ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనా? అనే ప్రశ్నతో సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి.  


2020 ఆగస్టు 5న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే (SA Bobde) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. 


Updated Date - 2022-09-08T22:27:21+05:30 IST