Rajiv Gandhi murder case: వారిని వదిలేయండి

ABN , First Publish Date - 2022-11-12T04:14:58+05:30 IST

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌, ఆర్‌పీ రవిచంద్రన్‌ సహా ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశించింది.

 Rajiv Gandhi murder case: వారిని   వదిలేయండి

రాజీవ్‌ హత్యకేసులో దోషుల విడుదలకు సుప్రీం ఆదేశం

నళిని సహా ఆరుగురికి జైలు నుంచి విముక్తి

సుప్రీం ఆదేశంతో మేలోనే పేరరివాలన్‌ విడుదల

అదే తీర్పు మిగిలిన ఆరుగురికీ వర్తిస్తుందన్న ధర్మాసనం

కేబినెట్‌ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడాలి: నళిని లాయర్‌

సుప్రీంకోర్టు తీర్పు ఇదే స్పష్టం చేసిందని వ్యాఖ్య

తీర్పును స్వాగతించిన తమిళనాడు రాజకీయ పార్టీలు

విడుదల ఆమోదయోగ్యం కాదన్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, చెన్నై, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌, ఆర్‌పీ రవిచంద్రన్‌ సహా ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో మరో దోషి ఏజీ పేరరివాలన్‌ ముందస్తు విడుదలకు ఈ ఏడాది మేలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ సందర్భంగా ఇచ్చిన తీర్పే మిగిలిన ఆరుగురు నిందితులకూ వర్తిస్తుందని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘మా ముందున్న దరఖాస్తుదారుల మరణశిక్షను గతంలోనే జీవిత ఖైదుగా మార్చారు. వీరంతా శిక్ష పూర్తి చేసుకున్నట్టు భావించాలి. వీరిపై ఇతర కేసులలో అనుభవించాల్సిన శిక్షలు ఏమీ లేకుంటే విడుదల చేయాలని ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. దోషులు 33 ఏళ్లకుపైగా జైలు శిక్ష అనుభవించారని, జైల్లో సత్ప్రవర్తనతో మెలిగారనే కారణాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

‘నళిని 3 దశాబ్దాలకుపైగా జైల్లో ఉన్నారు. ఆమె ప్రవర్తన సంతృప్తికరంగా ఉంది. ఆమె కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా చేశారు. రవిచంద్రన్‌ ప్రవర్తన కూడా సంతృప్తికరంగానే ఉంది. జైల్లోనే పీజీ డిప్లొమా సహా అనేక కోర్సులు పూర్తి చేశాడు. మానవతా సాయానికి నిధులు కూడాసమీకరించాడు’ అని కోర్టు పేర్కొంది. అందుకే వారి అభ్యర్థనలను పరిశీలనకు స్వీకరించామని, వారి విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాజీవ్‌గాంధీని థాను అనే మహిళా ఆత్మాహుతి బాంబర్‌ హత్య చేసింది. ఈ కేసులో నళిని, రవిచంద్రన్‌, శాంతన్‌, మురుగన్‌, పేరరివాలన్‌, రాబర్ట్‌ పయాస్‌, జయకుమార్‌ అనే ఏడుగురు దోషులు జీవితఖైదు అనుభవిస్తున్నారు.

తొలుత వీరికి టాడా(ఉగ్రవాద వ్యతిరేక) కోర్టు 1998లో మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. పేరరివాలన్‌, మురుగన్‌, శాంతన్‌, నళిని మరణశిక్షను 1999లో సుప్రీంకోర్టు సమర్థించింది. నళినికి ఒక కుమార్తె ఉందనే కారణాన్ని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం 2001లో ఆమె మరణశిక్షను జీవితఖైదుగా మార్చింది. 2014లో మిగిలిన ఆరుగురి మరణశిక్షలనూ జీవితఖైదుగా సుప్రీంకోరు తగ్గించింది. కాగా, 30 ఏళ్లకుపైగా జైలు శిక్ష అనుభవించిన పేరరివాలన్‌ను ముందస్తుగా విడుదల చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 18న ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు విడుదల కోసం నళిని, రవిచంద్రన్‌ అభ్యర్థనలను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును వారిద్దరూ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అదే సమయంలో మిగిలిన నలుగురు కూడా ముందస్తు విడుదల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించిన అత్యున్నత న్యాయస్థానం మిగిలిన ఆరుగురు దోషులకూ మే 18 నాటి తీర్పే వర్తిస్తుందని తాజా తీర్పులో పేర్కొంది. వీరిని విడుదల చేయాలని 2018లోనే తమిళనాడు ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు చేసిన విషయాన్ని తీర్పులో ప్రస్తావించింది. తీర్పు నేపథ్యంలో వీరంతా రెండు మూడు రోజుల్లో జైలు నుంచి విడుదలకానున్నారు.

కేబినెట్‌ సిఫారసును గవర్నర్‌ అమలు చేయాల్సిందే..

సుప్రీంకోర్టు తీర్పు పట్ల నళిని న్యాయవాది పి.పుగలెంథి సంతోషం వ్యక్తం చేశారు. కేబినెట్‌ సిఫారసును గవర్నర్‌ అమలు చేయాలని, దోషులను విడుదల చేయాలని తాజా తీర్పు ద్వారా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. మారు రామ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే చెప్పిందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 161 ప్రకారం ఖైదీలకు శిక్ష తగ్గింపు, విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని 1981 నాటి రూలింగ్‌లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. అందువల్ల రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయాన్ని ఆమోదించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు. ఈ కేసులో ఏడుగురు దోషుల విడుదలకు 2018లోనే తమిళనాడు కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నప్పటికీ, రాజకీయ కారణాలతో వారి విడుదలను కేంద్రప్రభుత్వం అడ్డుకుందని ఆక్షేపించారు.

భారతదేశ స్ఫూర్తికి అనుగుణంగా లేదు: కాంగ్రెస్‌

తీర్పును కాంగ్రెస్‌ తప్ప, మిగిలిన అన్ని పార్టీలు స్వాగతించాయి. డీఎంకే అధికారంలో ఉన్నా, లేకున్నా వారి విడుదలకు పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ గళమెత్తిందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ చెప్పారు. నళిని ఉరిశిక్షను యావజ్జీవ కారాగారశిక్షగా తగ్గించింది తన తండ్రి కరుణానిధి నేతృత్వంలోని ప్రభుత్వమేనని గుర్తుచేశారు. మిగిలిన పార్టీలు సైతం తీర్పును స్వాగతించాయి. కాంగ్రెస్‌, తమిళ మానిల్‌ కాంగ్రెస్‌ మాత్రం తీర్పును వ్యతిరేకించాయి. దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసిన రాజీవ్‌ను అమానుషంగా హతమార్చిన వారిని విడుదల చేయడం సరి కాదని, నళిని బృందం విడుదల పట్ల కార్యకర్తలెవ్వరూ వేడుకలు జరుపుకోరాదని సూచించాయి.

వారి విడుదల ఆమోదయోగ్యం కాదని, అది పూర్తిగా తప్పని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ల విభాగం ఇన్‌చార్జి జైరామ్‌ రమేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, వీరిని మానవతా కారణాలతో విడుదల చేశారని, వారి విడుదలను వ్యతిరేకించేవారు భారత చట్టాలను గౌరవించాలని నళిని సోదరుడు బకియనాథన్‌ కోరారు. ఓ ఆంగ్ల టీవీచానల్‌తో ఆయన మాట్లాడుతూ ‘ఈ కేసులో మేం పరిస్థితుల బాధితులం. ప్రాణాలు కోల్పోయినవారికి వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నాం’ అని రాజీవ్‌గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి బకియనాథన్‌ పేర్కొన్నారు. తీర్పు పట్ల నళిని చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టుకు, భారత పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు.

మమ్మల్ని మా దేశానికి పంపించేయండి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జైలు నుంచి బయటకు రాగానే తమను తమ దేశమైన శ్రీలంకకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని మురుగన్‌, శాంతను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వారి తరఫు న్యాయవాది రాజగురు మీడియాకు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వేలూరు జైలులో వారిద్దరినీ ఆయన కలిశారు. వారిద్దరికి అవసరమైన పాస్‌పోర్టు, వీసాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాజగురు డిమాండ్‌ చేశారు. వారి విడుదలకు కృషి చేసినవారందరికీ రుణ పడి ఉంటామన్నారు.

Updated Date - 2022-11-12T04:14:58+05:30 IST

Read more