Supreme Court : అరెస్ట్ అనేది శిక్ష సాధనం కాకూడదు..

ABN , First Publish Date - 2022-07-27T02:02:05+05:30 IST

దేశంలో సోషల్ మీడియా(Social media) విస్తృత వినియోగంలోకి వచ్చాక ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’(Freedom Of Expression)పై ఎడతెగని చర్చ సాగుతోంది.

Supreme Court : అరెస్ట్ అనేది శిక్ష సాధనం కాకూడదు..

న్యూఢిల్లీ : దేశంలో సోషల్ మీడియా(Social media) విస్తృత వినియోగంలోకి వచ్చాక ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’(Freedom Of Expression)పై ఎడతెగని చర్చ సాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులపై చెలరేగుతున్న వివాదాలు ఈ చర్చను నిత్యం రగుల్చుతూనే ఉన్నాయి. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఆంక్షల్లో చిక్కుకున్నదని ప్రజాస్వామికవాదులు గొంతు విప్పుతున్నారు. ఇలా ప్రజాస్వామిక విలువల పక్షాన వాదిస్తున్న వాళ్లందరికీ మహ్మద్ జుబైర్(Mohammed Zubair) కేసులో సోమవారం సుప్రీంకోర్ట్(Supreme Court) ఇచ్చిన కీలక తీర్పు గొప్ప ఊరటగా అనిపిస్తోంది. ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ‘ఆల్డ్ న్యూస్’(Alt news) సహ- వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ ‘నేర ప్రక్రియ’లో ఇరుక్కున్నాడని, అతడికి వ్యతిరేకంగా ‘క్రిమినల్ జస్టిస్ యంత్రాంగం’ నిరంతరాయంగా పనిచేసిందని కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే వేర్వేరు ప్రాంతాల్లో కేసులు, అరెస్ట్, ట్రయల్స్, బెయిల్‌లో ఆటంకాల పట్ల ప్రభుత్వ వ్యవస్థల తీరును తప్పుబట్టినట్టయింది.


మహ్మద్ జుబైర్ ఒక జర్నలిస్ట్ అని, ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్‌కి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నాడని పేర్కొన్న కోర్టు.. నకిలీ వార్తలను జనాలకు వెల్లడించేందుకు ట్విటర్‌ను మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నాడని  బాసటగా నిలిచింది. మోర్ఫింగ్ చేసిన ఫొటోలు, క్లిక్‌బైట్, కట్ చేసిన వీడియోలను ట్విటర్ ద్వారా వెల్లడిస్తున్నాడు. ఇలా చేయొద్దని అతడిపై ఆంక్షలు విధించడమంటే వాక్, భావప్రకటనా స్వేచ్ఛతోపాటు అతడి వృత్తికి కూడా విఘాతం కలిగించడమేనని సుప్రీంకోర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్టయ్యింది.


శిక్షను చట్టాలు నిర్ణయిస్తాయి..

వేర్వేరు ప్రాంతాల్లో కేసులు, అరెస్టులు, బెయిళ్లు ఈ ప్రక్రియే ఒక శిక్ష అని, అరెస్ట్‌‌ను ఒక శిక్ష సాధనంగా ఎంతమాత్రం ఉపయోగించరాదని సున్నితంగా హెచ్చరించింది. నేరం రుజువైతే శిక్ష ఏంటనేది నేర-చట్టాలు నిర్ణయిస్తాయని, అలాకాదని అరెస్ట్‌నే శిక్ష సాధనంగా వినియోగిస్తే వ్యక్తిగత స్వేచ్ఛ హననమే అవుతుందని జడ్జిలు డీవై చంద్రచూడ్, ఏఎస్ బోపన్నలతో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆరోపణల ఆధారంగానే వ్యక్తులను శిక్షించకూడదని, కోర్టు విచారణ లేకుండానే ఇబ్బందులకు గురిచేయడం తగదని ప్రస్తుత పరిణామాలను ప్రస్తావించింది. విచక్షణ లేకుండా, చట్టాలకు విరుద్ధంగా అరెస్ట్ చేయడమంటే అధికార దుర్వినియోగమే అవుతుందని ప్రభుత్వ యంత్రాలను హెచ్చరించింది. ఈ కేసులో వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేస్తూ 20 పేజీలతో కూడిన తీర్పును సోమవారం ప్రచురించింది.


కాగా మహమ్మద్ జుబైర్‌పై ఢిల్లీ(Delhi), ఉత్తరప్రదేశ్(Uttarpradesh) రాష్ట్రాలలో నమోదైన కేసుల విషయంలో జులై 20న సుప్రీంకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. యూపీలో నమోదయిన కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించింది. ట్వీట్లు చేయకుండా జుబైర్‌ని నిరోధించాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున దాఖలైన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. ఇలా చేస్తే భావప్రకటనా స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఒక పాపులర్ హిందీ సినిమా స్ర్కీన్ షాట్‌ని నాలుగేళ్ల క్రితం షేర్ చేసినందుకుగానూ మమ్మద్ జుబైర్‌పై కేసు నమోదయ్యింది. ఆ తర్వాత నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వేర్వేరు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయిన విషయం తెలిసిందే.


ఇటివల స్వయంగా సీజేఐ(CJI) ఎన్‌వీ రమణ(NV Ramana) కూడా ఇదే భావనతో కూడిన వ్యాఖ్యలు చేశారు. న్యాయప్రక్రియే ఒక శిక్షగా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు. వివక్షపూరిత అరెస్టుల నుంచి బెయిల్ పొందడం క్లిష్టంగా మారిపోయిందన్నారు. దీర్ఘకాలం కొనసాగుతున్న ట్రయల్స్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏ కేసునీ ఆయన ప్రస్తావించలేదు. ఈ పరిణామాలన్ని ప్రజాస్వామిక భావనలకై గొంతు వినిపిస్తున్నవారికి ఉపశమనం కలిగించే అంశాలుగానే పరిగణించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more