Supreme Court : అంత వేగమెందుకు?

ABN , First Publish Date - 2022-11-25T04:10:05+05:30 IST

స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ను మెరుపు వేగంతో కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి కారణమేంటని సుప్రీం కోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కే

Supreme Court : అంత వేగమెందుకు?

ఇది సాధారణ నియామకంలా జరిగినట్టు కనిపిస్తోందా?

ఈసీగా అరుణ్‌గోయల్‌ నియామకంపై కేంద్రానికి సుప్రీం ప్రశ్నలు

మే 15 నుంచి నవంబరు దాకా ప్రభుత్వం ఏం చేసిందని నిలదీత

ప్రక్రియ ప్రారంభించిన 24 గంటల్లోపే పూర్తి చేయడంపై విస్మయం

ప్రభుత్వం తల్చుకుంటే ఏమైనా చేయగలదనేనా అంటూ వ్యాఖ్య

ఈసీ నియామకాలపై తీర్పు వాయిదా వేసిన రాజ్యాంగ ధర్మాసనం

‘‘అదే రోజు ప్రాసెస్‌. అదే రోజు క్లియరెన్స్‌. అదేరోజు అప్లికేషన్‌. అదే రోజు నియామకం. ఫైలు కనీసం 24 గంటలు కూడా ప్రయాణించలేదు. మెరుపు వేగమిది’’

- ఈసీగా అరుణ్‌ గోయల్‌ నియామకంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం

న్యూఢిల్లీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ను మెరుపు వేగంతో కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి కారణమేంటని సుప్రీం కోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కేవలం 24 గంటల్లో ఆయన పేరును పరిశీలించి, ఎంపిక చేయడంపై జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ను నియమించే ప్రక్రియను పారదర్శకంగా, ప్రజాస్వామికంగా చేసే విషయంపై తీర్పును వాయిదా వేసింది. ఎన్నికల కమిషన్‌ సభ్యులను నియమించే విషయంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని.. రాజ్యాంగంలోని 342(2) అధికరణకు విరుద్ధంగా ఎన్నికల కమిషనర్లను నియమిస్తున్నారని పేర్కొంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్నసంగతి తెలిసిందే. బుధవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు.. అరుణ్‌గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను కేంద్రం ధర్మాసనానికి సమర్పించింది. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. ‘‘ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించి షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితాలోంచి కేంద్ర న్యాయమంత్రి నలుగురి పేర్లను ఎంపిక చేసినరోజే ఆ ఫైల్‌ను ముందుకు కదిలించారు. అదేరోజు ప్రధాని ఆమోదం తెలిపారు. ఎందుకు అంత హడావుడి? ఏమిటంత మెరుపువేగం? అసలు ఏ ప్రాతిపదికన ఆ నలుగురినీ ఎంపిక చేశారు? ఈ పోస్టు మే 15 నుంచి ఖాళీగా ఉంది. అప్పట్నుంచీ నవంబరు దాకా మీరేం చేశారు? ఇంత తొందరగా నియామకం చేపట్టడానికి కారణమేంటి? మొత్తం ప్రక్రియను ఒకేరోజు ప్రారంభించి ముగించారు. కనీసం 24 గంటలుకూడా పట్టలేదు. నియామక ప్రక్రియ పూర్తి చేసి నోటిఫై చేశారు. మేం అరుణ్‌గోయల్‌ ప్రతిభను ప్రశ్నించడం లేదు.. నియామకానికి అనుసరించిన ప్రక్రియను ప్రశ్నిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించింది.

రాజ్యాంగాన్ని సవరించాలి..

కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ వెంకటరమణి.. ‘‘భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత తదితరులతో కూడిన కమిటీ ద్వారా ఎన్నికల కమిషనర్లను నియమించే పద్ధతిని మీరు పరిశీలిస్తున్నారు. ఈసీ విషయంలో కూడా కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అయితే, అందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది’’ అని తెలిపారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఎన్నికల కమిషనర్‌ నియమించేందుకు 1991లో చట్టం చేశారని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి తొలుత సీనియర్‌ అధికారుల పేర్లతో జాబితాను రూపొందిస్తామని.. దాన్ని న్యాయమంత్రిత్వ శాఖకు పంపుతారని.. ఆ తర్వాత ఫైలు ప్రధానమంత్రి వద్దకు వెళుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఈ విధానం బాగానే పనిచేస్తోందని, కోర్టు జోక్యం చేసుకునేందుకు కారణాలు లేవని ఆయన వాదించారు. ‘‘మీరు కోర్టు వేసే ప్రశ్నలను జాగ్రత్తగా విని వాటికి జవాబు చెప్పాలి’’ అని ఈ సందర్భంగా న్యాయమూర్తి అజయ్‌ రస్తోగి వ్యాఖ్యానించారు. ‘‘24 గంటల్లో మీరెలా ఎన్నికల కమిషనర్ల పేర్లను పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు? మే 15 నుంచి కమిషనర్‌ పదవి ఖాళీగా ఉంటే నవంబర్‌ వరకు నిర్ణయం తీసుకోకుండా ఒక్కరోజులో వేగంగా తీసుకునేందుకు కారణమేమిటి? ప్రభుత్వం తలచుకుంటే ఏమైనా చేయగలదనేగా?’’ అని నిలదీశారు. దీనికి వెంకటరమణి.. ‘‘24 గంటల్లో చాలా నియామకాలు జరుగుతాయి. వాటన్నిటినీ పరిశీలిస్తారా. మేము సరైన పద్ధతి ప్రకారమే ఆయన పేరున పరిశీలించాం’’ అని జవాబిచ్చారు. ‘‘మేమడుగుతున్నది సరైన పద్ధతిని పాటించారా? లేదా? అనే’’ అని జస్టిస్‌ జోసెఫ్‌ అడిగారు. ‘‘అది సరే, నలుగురి పేర్లను పరిశీలించాక.. ఈయన పేరునే ఎందుకు ఎంపిక చేశారు? ఆయన స్వచ్ఛంద పదవీవిరమణ కూడా అతి వేగంగా జరిగింది. ఇది సాధారణంగా జరిగిన నియామకంలాగా కనిపిస్తోందా’’ అని జస్టిస్‌ బోస్‌ నిలదీశారు. అరుణ్‌ గోయల్‌ డిసెంబర్‌ 31 రిటైర్‌ కావాల్సి ఉందని.. ఒక నెల ముందు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని ఏజే వివరించారు. ఈ నియామకాన్ని సమగ్రంగా పరిశీలించాలిగానీ.. విడదీసి చూడరాదని ఆయన కోరారు. నియమించిన అధికారి నేపథ్యం ముఖ్యం కాని ఆ అధికారి ఎప్పుడు పదవీవిరమణ చేశారన్నది కాదని ఆయన వాదించారు.

కావాలనే అలా..

ప్రధాన ఎన్నికల కమిషనర్ల పదవీకాలం 2017 నుంచి.. కొద్ది రోజులే ఉంటోందని, తాము నియమించే అధికారి పుట్టిన రోజు ప్రభుత్వానికి తెలిసినందువల్ల పూర్తిగా ఆరేళ్లు పదవిలో ఉండే వారిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించకుండా జాగ్రత్తపడుతోందని జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుత కేసులో కూడా.. ఎన్నికల కమిషనర్‌గా నియమించేందుకు ఎంపిక చేసిన నలుగురు సభ్యుల్లో ఏ ఒక్కరి పదవీకాలం ఆరేళ్లు లేకుండా జాగ్రత్తపడిందని పేర్కొంది. దీనికి ఏజే.. తాము నియమించే ఎన్నికల కమిషనర్‌ ఆరేళ్లు పూర్తి చేస్తారా, మధ్యలో పదవీవిరమణ చేస్తారా అన్నది కూడా చూడలేమని చెప్పారు. ఇరువర్గాల వాదనలూ విన్న ధర్మాసనం.. లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు ఇరుపక్షాలకూ ఐదురోజుల గడువు ఇస్తూ తీర్పును వాయిదా వేసింది.

దయచేసి నోరు మూసుకోండి

విచారణ జరుగుతున్న సమయంలో.. ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఏజే వెంకటరమణి సమాధానం చెప్పబోయారు. ఆ సమయంలో ప్రశాంత్‌భూషణ్‌ బెంచ్‌ను ఉద్దేశించి ఏదో చెప్పబోగా.. ఏజే ఆయన్ను ఆపి సమాధానం ఇవ్వడం ప్రారంభించారు. మధ్యలో మరోసారి ప్రశాంత్‌భూషణ్‌ జోక్యం చేసుకునే ప్రయత్నం చేయగా.. ఏజే ఆయనను ఉద్దేశించి.. ‘దయచేసి.. దయచేసి.. కాసేపు మీరు నోరు మూసుకోండి (ప్లీజ్‌.. ప్లీజ్‌ హోల్డ్‌ యువర్‌ మౌత్‌ ఫర్‌ ఏ వైల్‌)’’ అన్నారు! దీంతో ప్రశాంత్‌ భూషణ్‌ కూర్చుండిపోయారు. ఏజే తన వాదనను కొనసాగించారు.

Updated Date - 2022-11-25T04:10:05+05:30 IST

Read more