Sonia Gandhi: అశోక్ గెహ్లాట్ విషయంలో సోనియా రెండు తప్పులు!

ABN , First Publish Date - 2022-09-30T02:55:15+05:30 IST

సాధారణంగా రాజకీయాల్లో ‘అధికారం’ అనేది చాలా శక్తిమంతమైనది. ఇది శాసిస్తుంది. అందుకనే రాజకీయవేత్తను

Sonia Gandhi: అశోక్ గెహ్లాట్ విషయంలో సోనియా రెండు తప్పులు!

న్యూఢిల్లీ:  సాధారణంగా రాజకీయాల్లో ‘అధికారం’ అనేది చాలా శక్తిమంతమైనది. ఇది శాసిస్తుంది. అందుకనే రాజకీయవేత్తను ‘కింగ్ ఆఫ్ ద వరల్డ్’ అంటారు. ఇది నిజమే కావొచ్చు. కాకపోతే అధికారంలో ఉంటేనే ఈ పదానికి అర్థం ఉంటుంది. దేశానికి సేవ చేసేందుకు, సమాజానికి తనవంతు సేవలు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని రాజకీయ నాయకులు చెబుతారు. సాధారణంగా ప్రతి ఒక్కరు చెప్పే కామన్ కారణం ఇదే. అయితే, రాజకీయాల్లోకి వచ్చాక అసలు తత్వం బోధపడుతుంది. ఏం చేయాలన్నా ‘పవర్’ ముఖ్యమని. కాబట్టి రాజకీయాల్లో ‘అధికారం’ ముఖ్యపాత్ర పోషిస్తుంది.  ఇంకా చెప్పాలంటే శాసిస్తుంది.


ఉదాహరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)నే తీసుకుంటే బీజేపీని ఆయన ఉక్కు పడికిలితో శాసిస్తున్నారు. ఆయన ఏం కావాలనుకుంటే అది చేయగలుగుతారు. అంతమాత్రాన ఆయన సూపర్ హ్యూమన్ అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎన్నికల్లో విజయం ఆయనకు ఆ శక్తిని ఇచ్చింది. బీజేపీ నాయకులకు కూడా ఈ విషయం తెలుసు. తాము గెలవాలన్నా కూడా ఆయన పేరు చెప్పుకోవాల్సిందేనని. ఆయన పేరెత్తకుండా ఎన్నికల్లో గెలవడం దాదాపు అసాధ్యం. మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఇలాగే ఉంటుంది. అది యూఎస్ అయినా, యూకే అయినా ఇంతే. 


ఇండియాలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. 1996 ఎన్నికల్లో ఓటమి తర్వాత పీవీ నరసింహారావును కాంగ్రెస్ (Congress) ముందుకు తీసుకొచ్చింది. అలాగే, బీజేపీని ఎప్పటికీ నిలబెట్టేది ఎల్‌కే అద్వానీ అని భావించారు. అయితే, ఆ తర్వాత మోదీ తిరుగులేని నాయకుడిగా ఉద్భవించారు. ఇప్పుడిక సోనియాగాంధీ (Sonia Gandhi) విషయానికి వస్తే.. 1991లో రాజీవ్‌గాంధీ హత్యకు గురైనప్పుడు ఆమెకు కాంగ్రెస్ నాయకత్వంతోపాటు ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం కూడా చిక్కింది. 2004లోనూ ఆమె ప్రధానమంత్రి అయ్యే చాన్స్ వచ్చినా మళ్లీ ఆమె తిరస్కరించారు. అయితే, చాలామంది రాజకీయ నాయకుల్లా ఆమె అధికారం విషయంలో ఫిక్స్ కాలేదు. ఆమె రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అయినప్పటికీ పార్టీ ఆమె వెన్నంటే ఉంది.  2014లో పార్టీ ఘోర పరాజయం పాలైనప్పుడు కూడా ఎవరూ ఆమెను అధ్యక్ష పదవి నుంచి తప్పుకోమని అడగలేదు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆమె తన కుమారుడు రాహుల్‌ని నామినేట్ చేయగలిగారు. అయితే, ముందే చెప్పుకున్నట్టు అధికారం ఇక్కడ చాలా శక్తిమంతమైనది. ఎప్పుడూ ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండలేరు. వరస అపజయాలు ఆ పార్టీని కుంగదీశాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం ద్వారా పార్టీలో జవసత్వాలు నింపాలని పార్టీ యోచిస్తోంది. 


ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) కాంగ్రెస్ అధ్యక్ష రేసులోకి వచ్చారు. ఆయనకు రహస్యంగా మద్దతు ఇవ్వడంలో సోనియా రెండు తప్పులు చేశారు. ముఖ్యమంత్రి పదవి కంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తీసుకునేందుకు ఇష్టపడతారని ఆమె నమ్మారు. ఎందుకంటే ఆ పదవిలో ఉండగా సోనియా ముఖ్యమంత్రులను నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కాంగ్రెస్‌కు అధికారం లేదు కాబట్టి అధ్యక్షుడికి ఎలాంటి ‘పవర్’ ఉండదు. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు ఎలా చేర్చాలన్న కష్టసాధ్యమైన పనిమాత్రం ఉంటుంది. మరోవైపు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మరోవైపు, నిజమైన ‘పవర్’ ఉంది. 


కాంగ్రెస్ అధ్యక్ష రేసులోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుందని గెహ్లాట్ ఊహించుకున్నారు. ఓవైపు ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే, అధ్యక్ష గిరీ కూడా వెలగబెట్టవచ్చునని భావించారు. అంతేకానీ, సీఎం పదవిని సచిన్ పైలట్‌కు అప్పగించాల్సి ఉంటుందని ఊహించలేకపోయారు. సోనియా గాంధీ కూడా గెహ్లాట్ అధ్యక్ష పదవిని వదులుకోబోరనే అనుకున్నారు. ఆయన తన అధికారాన్ని మరొకరికి అప్పగిస్తారని భావించారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా విషయంలోనూ, పంజాబ్‌లో అమరీందర్ సింగ్ విషయంలోనూ ఇలానే ఆలోచించి దెబ్బతిన్నారు. పంజాబ్‌లో సిద్ధూను ప్రమోట్ చేసి అధికారానికి దూరం కాగా, జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. పంజాబ్‌లో అమరీందర్ ఇప్పుడు బీజేపీతో చేతులు కలపగా సిద్ధూ జైలులో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గెహ్లాట్‌కు సోనియా నిశ్శబ్దంగా మద్దుతు ఇచ్చినప్పటికీ ఆయన తన అధికారాన్ని పైలట్ చేతిలో పెడతారని సోనియా నమ్మడం ఆమె చేసిన రెండో తప్పు. ‘పవర్’ లేని అధికారం కంటే రాష్ట్రాన్ని శాసించగల సీఎం పదవి గొప్పదని భావించిన గెహ్లాట్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. 


ఈ ఘటన బట్టి గుర్తుంచుకోవాల్సిన రెండు పాఠాలు ఉన్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్‌లో కొద్దిమంది మాత్రమే నిజమైన రాజకీయ శక్తిని కలిగి ఉన్నారు. వారు దానిని స్వచ్ఛందంగా వదులుకోవాలని అనుకోవడం తప్పే అవుతుంది. అలాగే, కాంగ్రెస్ నాయకులు తాము చెప్పినట్టు చేస్తారని గాంధీలు అనుకోవడం కూడా మరో తప్పు.  

Updated Date - 2022-09-30T02:55:15+05:30 IST