More Loyal than the King: అస్మదీయుడు అశోక్ గెహ్లాట్

ABN , First Publish Date - 2022-08-24T23:30:22+05:30 IST

దేశంలోనే రెండవ అతి పెద్ద పార్టీ అఖిలభారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష

More Loyal than the King: అస్మదీయుడు అశోక్ గెహ్లాట్

దేశంలోనే రెండవ అతి పెద్ద పార్టీ అఖిలభారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అంటే ఆషామాషీ కాదు. అది కూడా గాంధీ వారసత్వ పరంపరకే దక్కుతున్న నేపథ్యంలో, గాంధీ కుటుంబానికి బైట నాయకుడిని ఆ అవకాశం వెదుక్కుంటూ రావడం ఇంకా విశేషం. అదొక్కటి చాలు ఆ నాయకుడు వీర విధేయుడని చెప్పడానికి. రాజస్థాన్ లో అంగబలం, అర్థబలం లేని ఒక బడుగు సామాజిక వర్గానికి చెందిన అశోక్ గెహ్లాట్ అనేక పర్యాయాలు ఎంపీగా ఎన్నికైనా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టినా, ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష స్థానానికి చేరువలో ఉన్నా, వీటన్నింటికీ కారణం – గాంధీ కుటుంబానికి ఆయన వీరవిధేయతే!


ఇందిరా గాంధీ (Indira Gandhi) నుంచి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) వరకు, కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి సామాన్య కార్యకర్తల వరకు అందరినీ కలుపుకునిపోయే చాకచక్యం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) సొంతం. ఆయన కాంగ్రెస్‌లోని కెప్టెన్ అమరీందర్ సింగ్ (Captain Amarinder Singh), కమల్‌నాథ్‌ వంటివారిలా కాకుండా అధిష్ఠానానికి విధేయంగా ఉంటూనే తన పంతాన్ని నెగ్గించుకోగల చాకచక్యంగలవారు. ‘ఈ గడ్డపై పుట్టినవాడు’ (Son of the soil) అనిపించే రూపం, హావభావాలతో అందరినీ ఆకట్టుకుంటారు. గాంధీ కుటుంబానికి ఎంత వీర విధేయుడంటే, దేశాన్ని కాపాడటానికే ఇందిరమ్మ ఎమర్జెన్సీ విధించారని చెప్పేటంత! అందుకే ఆయనను తదుపరి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని సోనియా గాంధీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 




గాంధీల నిర్ణయం

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఆ పదవిని మళ్ళీ చేపట్టబోనని రాహుల్ గాంధీ (Rahul Gandhi) కరాఖండీగా చెప్పేశారు. ప్రియాంక గాంధీ ఆ పదవిపై ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ (Madhusudan Mistry) మాట్లాడుతూ, సెప్టెంబరు 20నాటికి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన తేదీలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనుమతి ఇవ్వవలసి ఉందని చెప్పారు. ఇదిలావుండగా, సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఆమెతోపాటు రాహుల్, ప్రియాంక కూడా వెళ్తున్నారు. అశోక్ గెహ్లాట్‌తో  సోనియా మంగళవారం రహస్య సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టాలని ఆయనను సోనియా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే  తాను మీడియాలోనే ఈ విషయాన్ని చూశానని, తనతో ఆమె ఈ విషయాన్ని చెప్పలేదని బుధవారం ఆయన మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ పట్ల గాంధీ కుటుంబానికి ఎందుకు అంత అభిమానం? అనే విషయం అందరి మదినీ తొలుస్తోంది. 


సామాన్య కుటుంబం

అశోక్ గెహ్లాట్ 1951 మే 3న ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి బాబు లక్ష్మణ్ సింగ్ గెహ్లాట్ వృత్తి రీత్యా మెజీషియన్. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆయన ఇంద్రజాల ప్రదర్శనలు చేసేవారు. అశోక్ సైన్స్, న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్. ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చేశారు. ఆయనకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. 




మహాత్ముని స్ఫూర్తితో నిరాడంబర జీవనం

అశోక్ విద్యార్థి దశలోనే మహాత్మా గాంధీ బోధనలతో ప్రేరణ పొందారు. సాంఘిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. గాంధేయవాదిగా వ్యవహరిస్తూ అత్యంత నిరాడంబరంగా జీవించేవారు. గాంధీ జీవనశైలిని అలవరచుకోవడం కోసం ఆయన వార్ధాలో ఉండేవారు. ఆయన సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు. స్వచ్ఛమైన శాకాహారి. అది కూడా సూర్యాస్తమయానికి ముందే ఆహారాన్ని స్వీకరిస్తారు. మద్యాన్ని అసలు ముట్టరు. 


ఇందిరా గాంధీతో తొలి పరిచయం

1971లో తూర్పు బెంగాలీ శరణార్థుల సంక్షోభ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన శరణార్థులకు సేవలందించారు. ఆ సమయంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆ శరణార్థి శిబిరాలను సందర్శించారు. అక్కడ సేవలందిస్తున్న అశోక్ సమర్థత, నైపుణ్యాలను గుర్తించారు. ఆ తర్వాత ఆయన ఎన్ఎస్‌యూఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1977లో తొలిసారి రాజస్థాన్ శాసన సభ సభ్యత్వం కోసం పోటీ చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని 1998 డిసెంబరు నుంచి 2003 వరకు, అదేవిధంగా 2008 నుంచి 2013 వరకు నిర్వహించారు. ప్రస్తుతం 2018 డిసెంబరు నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాల్లో కేంద్ర మంత్రిగా పని చేశారు. 


అశోక్‌ను నమ్మడానికి బలమైన కారణాలు

గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన అశోక్ గెహ్లాట్ గొప్ప వాక్చాతుర్యం కలవారేమీ కాదు. ఇందిరా గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక కూడా ఆయనను విశ్వసించడానికి బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఆయన మాలి అనే వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవారు, రాష్ట్రంలో ఈ సామాజిక వర్గం ఆధిపత్య వర్గం కాదు. ఆయనకు ప్రజాదరణ ఉంది, కానీ గాంధీ కుటుంబాన్ని సవాల్ చేసే స్థాయిలో అది లేదు. రాజకీయంగా ఆయనకు పెద్దగా కోరికలేమీ లేవు. అయితే తన కుమారుడు వైభవ్‌ను తన వారసునిగా తీర్చిదిద్దుకోవాలని ఆయన బలంగా కోరుకుంటారు. ఆయన ఐదుసార్లు ఎంపీగా గెలిచినా, రాజస్థాన్‌ను దాటి ఆయన నాయకుడిగా ఎదగలేదు. ఇలాంటివన్నీ గాంధీ కుటుంబం ఆయనను విశ్వసించడానికి కారణమని చెబుతారు. 


ప్రతి కార్యకర్తకూ అందుబాటులో...

గాంధీ కుటుంబానికి మరో వీర విధేయుడు అహ్మద్ పటేల్‌తో కూడా సన్నిహితంగా మెలిగే చాకచక్యం అశోక్‌కు ఉంది. రాహుల్ గాంధీ పట్ల గట్టి నమ్మకాన్ని ప్రదర్శించడంలో ఆయనకు ఆయనే సాటి. అన్ని వయసులవారితోనూ ఆత్మీయంగా మెలగడంలో దిట్ట. పార్టీ కార్యకర్తలు ఏ సమయంలోనైనా కలవడానికి, తమ సమస్యలను చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటారు. 




గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో...

ఇటువంటి నైపుణ్యాలతోనే అశోక్ 2017లో గుజరాత్ శాసన సభ ఎన్నికలను పర్యవేక్షించారు. కాంగ్రెస్ 77 స్థానాలు లభించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీకి బాగా నచ్చిన నేతల జాబితాలో (మధుసూదన్ మిస్త్రీ, తరుణ్ గొగోయ్, అజయ్ మాకెన్, సీపీ జోషీలతోపాటు) అశోక్ కూడా స్థానం సంపాదించారు. 


ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు

2018లో అశోక్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని నియంతృత్వంతో నడిపేవారు ఇందిరా గాంధీని నియంత అనడం విచిత్రం అని మండిపడ్డారు. దేశాన్ని కాపాడటానికే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారని, తన పదవిని కాపాడుకోవడానికి కాదని అన్నారు. గాంధీ కుటుంబానికి ఆయన వీర విధేయుడని చెప్పడానికి ఇంత కన్నా మరో ఉదాహరణ అక్కర్లేదు. 


వ్యూహాన్ని అమలు చేసే యోధుడు

మరోవైపు అశోక్ గెహ్లాట్ తన రాజకీయ ప్రత్యర్థులను చాకచక్యంగా మట్టుబెట్టారు. అయితే సచిన్ పైలట్‌తో కాస్త రాజీపడక తప్పలేదు. అధిష్ఠానానికి విధేయంగా ఉంటూనే తనకు కావలసినదానిని సాధించుకోవడం ఆయనకు బాగా తెలుసు. తనకు ఏదైనా పనిని అప్పగించినపుడు అత్యంత నిజాయితీతో పూర్తి చేస్తారు. అదేవిధంగా తనను పక్కనబెట్టినపుడు ఎటువంటి వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తం చేయరు. అయితే తాను అనుకున్నదాన్ని సాధించడం కోసం ఓ వ్యూహం ప్రకారం పని చేయగలరు. ఓ గొప్ప యోధుడిగా కనిపించరు కానీ తక్కువ స్థాయిలో ఉంటూనే పోరాడతారు. ఈ పద్ధతిని ఆయన అధిష్ఠానంతోనైనా, తన తోటి ఎమ్మెల్యేలు, మంత్రులతోనైనా పాటిస్తారు. ఎవరికి ఏం కావాలో, ఎప్పుడు కావాలో ఆయనకు బాగా తెలుసు. సరిగ్గా ఆ సమయానికి దానిని ఇచ్చి సంతృప్తిపరచేందుకు కృషి చేస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన ఎంతో ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకున్నారు. అలా అని ఆయన ఓ సాధువుగా మారిపోలేదు. తన శత్రువుకు తన సింహాసనాన్ని అప్పగించేందు సిద్ధంగా లేరు. 


ఆయన ఎంత చతురుడంటే వామపక్ష కార్యకర్తలతో కూడా సత్సంబంధాలు నెరపుతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పోరాడేటపుడు వారితో మాట్లాడి తన మాట వినేలా చేసుకుంటారు. అప్పుడప్పుడూ వారి ఎజెండాను అమలు చేస్తారు. ఇలాంటి లక్షణాలే ఆయనను గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రునిగా చేశాయి. 


                                                - యెనుములపల్లి వేంకట రమణ మూర్తి


Updated Date - 2022-08-24T23:30:22+05:30 IST