మోదీ సర్కార్‌తో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ కుమ్మక్కు

ABN , First Publish Date - 2022-03-17T08:14:03+05:30 IST

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ....

మోదీ సర్కార్‌తో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ కుమ్మక్కు

  •  సోషల్‌ మీడియా  ప్రజాస్వామ్యాన్ని కబళిస్తోంది
  • లోక్‌సభలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపణ
  • ఫేస్‌బుక్‌.. ప్రజాస్వామ్యానికి హానికరం: రాహుల్‌గాంధీ
  • సమష్టి నాయకత్వమే రక్ష
  • భావసారూప్య శక్తులతో చర్చలు జరపాలి
  • 2024 నాటికి బీజేపీకి ప్రత్యామ్నాయ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలి
  • కాంగ్రెస్‌ అసమ్మతి నేతల వెల్లడి
  • గులాం నబీ ఆజాద్‌ ఇంట్లో భేటీ హాజరైన శశిథరూర్‌, వాఘేలా


న్యూఢిల్లీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియాగాంధీ లోక్‌సభలో వాటిపై ఆరోపణలు చేయగా.. రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా ఫేస్‌బుక్‌పై ధ్వజమెత్తారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు భారత ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయని.. ఎన్నికల రాజకీయాల్లో ఒక పద్ధతి ప్రకారం జోక్యం చేసుకుంటూ ప్రభావితం చేస్తున్నాయని సోనియా ఆరోపించారు. రాజకీయ నేతలు, పార్టీలు, వారి అనుచరులు తమ రాజకీయ అభిప్రాయాలను వ్యాపింపజేసేందుకు ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారని, దీన్ని నివారించాలని ఆమె బుధవారం జీరో అవర్‌లో డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కబళించేందుకు సోషల్‌ మీడియా ఉపయోగపడడం ఒక ప్రమాదకరమైన పరిణామామని, ఇది రోజురోజుకూ పెరుగుతోందన్నారు. సామాజిక మాధ్యమాలు అన్ని రాజకీయ పార్టీలకూ సమాన అవకాశాలు కల్పించట్లేదని విమర్శించారు.


ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీకి ఫేస్‌బుక్‌ తక్కువ ధరలకే ఎన్నికల ప్రకటనలు జారీచేసే అవకాశం ఇచ్చిందని అల్‌ జజీరా ప్రచురించిన ఒక నివేదికను సోనియా ఉటంకించారు. బడా కార్పొరేషన్లు, అధికార పార్టీ, సామాజిక మాధ్యమ సంస్థలు కుమ్మక్కయ్యాయని ఈ నివేదికలు నిరూపిస్తున్నాయని ఆమె అన్నారు. అధికార పార్టీతో కుమ్మక్కై ఫేస్‌బుక్‌ పచ్చిగా దేశంలో సామాజిక సామరస్యాన్ని భంగం చేస్తోందని సోనియా ఆరోపించారు. రాహుల్‌ ప్రధానంగా ఫేస్‌బుక్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు. ‘మెటా (ఫేస్‌బుక్‌ మాతృసంస్థ).. ప్రజాస్వామ్యానికి హానికరం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. సభలో సోనియాగాంధీ ఉటంకించిన అల్‌జజీరా నివేదిక గురించి రాహుల్‌ కూడా ప్రస్తావించారు. 


ఐదు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి ఏంటి?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్‌.. ఆ రాష్ట్రాల్లో పార్టీ ప్రస్తుత పరిస్థితిపై సమీక్షకు సిద్ధమైంది. సోనియా ఈ బాధ్యతను ఐదుగురు సీనియర్‌ నేతలకు అప్పగించారు. కాగా, పంజాబ్‌ ఎంపీలతో సోనియా సమావేశమయ్యారు. అంతర్గత విభేదాలు, క్రమశిక్షణలేమి వల్లే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందని ఎంపీలు చెప్పారు.  

Read more