Congress President Poll: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?... ఆ అగ్ర నేతకు సోనియా గాంధీ అత్యవసర పిలుపు!...

ABN , First Publish Date - 2022-09-20T19:18:51+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో

Congress President Poll: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?... ఆ అగ్ర నేతకు సోనియా గాంధీ అత్యవసర పిలుపు!...

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) అత్యవసరంగా ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ను ఢిల్లీకి పిలిపించినట్లు విశ్వసనీయ సమాచారం. వేణుగోపాల్ (KC Venugopal) ప్రస్తుతం భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)తో పోటీ పడేందుకు కేరళకు చెందిన శశి థరూర్ (Shashi Tharoor) సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతోపాటు అనేక మంది సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. 


కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొంటున్న కేసీ వేణుగోపాల్‌ను తక్షణమే న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాలని సోనియా గాంధీ సందేశం పంపించారు. 


సై అంటున్న శశి థరూర్ 

శశి థరూర్ (Shashi Tharoor) గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. పార్టీలో ఆయన సీనియర్ నేత. పార్టీని ప్రక్షాళన చేయాలని సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మందిలో ఆయన ఒకరు. పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షుడు ఉండాలని గట్టిగా వాదిస్తున్నవారిలో ఆయన ఒకరు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 25 ఏళ్ళ నుంచి ఆ పదవిని గాంధీ కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 


అశోక్ గెహ్లాట్ వైపు సోనియా మొగ్గు?

ఇదిలావుండగా, అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)ను కాంగ్రెస్ అధ్యక్షునిగా చేయాలని సోనియా గాంధీ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కుమారునికి కొత్తగా ఏర్పాటయ్యే రాజస్థాన్ మంత్రివర్గంలో మంత్రి పదవి ఇస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన గాంధీ కుటుంబానికి వీర విధేయుడన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన మాత్రం రాహుల్ గాంధీ మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టాలని కోరుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. 


రాహుల్ గాంధీ రాజీనామా

2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోనియా గాంధీ ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 


భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) 13వ రోజు పాదయాత్రను చేర్తల నుంచి ప్రారంభించారు. సెయింట్ మైఖేల్స్ కళాశాలలో మొక్కను నాటిన అనంతరం ఆయన నడక ప్రారంభమైంది. ఆయనతోపాటు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పర్యావరణ విభాగం శస్త్రవేది ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 


ఎన్నికలు ఎప్పుడు?

షెడ్యూలు ప్రకారం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు అక్టోబరు 17న జరుగుతాయి. రెండు రోజుల అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఈ నెల 22 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 


Updated Date - 2022-09-20T19:18:51+05:30 IST