Smartphones: విద్యార్థుల స్మార్ట్‌ఫోన్లపై నిఘా బాధ్యత తల్లిదండ్రులదే..!

ABN , First Publish Date - 2022-12-13T11:32:03+05:30 IST

విద్యాసంస్థల తరగతి గదిలోకి ఎట్టి పరిస్థితిలోనూ స్మార్ట్‌ఫోన్లను(Smartphones) అనుమతించడం లేదని, సోషల్‌ మీడియాలో

Smartphones: విద్యార్థుల స్మార్ట్‌ఫోన్లపై నిఘా బాధ్యత తల్లిదండ్రులదే..!

- ప్రత్యేక సమావేశాల్లో తేల్చిచెప్పిన విద్యాసంస్థల నిర్వాహకులు

బెంగళూరు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థల తరగతి గదిలోకి ఎట్టి పరిస్థితిలోనూ స్మార్ట్‌ఫోన్లను(Smartphones) అనుమతించడం లేదని, సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటున్న విద్యార్థులపై ఇళ్లలో తల్లిదండ్రులే గట్టి నిఘా విధించాలని విద్యాసంస్థల నిర్వహకులు స్పష్టం చేశారు. విద్యార్థుల బ్యాగులను ఇటీవల పలు విద్యాసంస్థల్లో తనిఖీ చేసిన సమయంలో కండోమ్‌లు, డ్రగ్స్‌, స్మార్ట్‌ఫోన్లు(Condoms, drugs, smartphones) బయటపడ్డ నేపథ్యంలో విద్యాసంస్థల నిర్వహకులు గత కొన్ని రోజులుగా పోషకులతో నగర వ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు, వారిని సరైన దారిలో పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు తమ విద్యార్థుల స్మార్ట్‌ఫోన్లను నిశితంగా గమనిస్తుండాలని, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌, స్ర్కాప్‌చాట్లలో ఖాతాలు లేకుండా చూడాలన్నారు. ఒక వేళ ఉంటే తక్షణం తొలగించాలని విద్యా సంస్థల నిర్వహకులు సూచించారు. అలాగే పిల్లలకు మొబైల్‌ను మరీ అవసరమైతేనే ఇవ్వాలన్నారు. పదేళ్లలోపు పిల్లలు సైతం ఇన్‌స్ట్రాగ్రాంలో ఖాతాలు కలిగి ఉండటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. చాలా మంది విద్యార్థులు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారని, అర్ధరాత్రి వరకు చాటింగులతో గడుపుతున్నారని కూడా గుర్తించామన్నారు. అపరిచితులతో తమ పిల్లలు చాటింగ్‌ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కనీసం వారానికి ఒకసారైనా పిల్లల బ్యాగులను నిశితంగా పరిశీలించాలని, ఒక వేళ అభ్యంతరకరమైన వస్తువులు ఏవైనా కనబడితే తల్లిదండ్రులు కూర్చోబెట్టి సున్నితంగా హితవు పలకాలన్నారు. ఒక వేళ ఎవరైనా పిల్లలు మొండికేస్తే వారికి కౌన్సెలింగ్‌ చేయించాలని కూడా విద్యాసంస్థల నిర్వహకులు కోరారు. తమ పిల్లలు సోషల్‌ మీడియా బారిన పడి దారితప్పకుండా తగిన నిఘా విధిస్తామని పోషకులు ఆయా విద్యాసంస్థలకు లఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఇకపై కనీసం మూడు నెలలకోసారి ఇలా విద్యాసంస్థలు, పోషకులు మధ్య సమావేశాలను నిర్వహించాలని ఈ సమావేశంలో సూత్రప్రాయంగా తీర్మానించారు.

Updated Date - 2022-12-13T11:32:05+05:30 IST