స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలకు ‘నావిక్‌’ తంటా

ABN , First Publish Date - 2022-09-27T07:45:31+05:30 IST

వచ్చే జనవరి నుంచి దేశంలో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లన్నింటిలో ‘నావిక్‌’ వ్యవస్థ పనిచేసేలా ఏర్పాట్లు చేయాలంటూ ప్రభుత్వం

స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలకు ‘నావిక్‌’ తంటా

జనవరి నుంచి ఫోన్లు నావిక్‌ కంపాటిబుల్‌గా ఉండాలని ప్రభుత్వ ఆదేశం

ఖర్చులు పెరిగిపోతాయంటున్న ఫోన్‌ కంపెనీలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: వచ్చే జనవరి నుంచి దేశంలో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లన్నింటిలో ‘నావిక్‌’ వ్యవస్థ పనిచేసేలా ఏర్పాట్లు చేయాలంటూ ప్రభుత్వం  ఇచ్చిన ఆదేశాలతో స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు తల పట్టుకుంటున్నాయి! అందుకు చాలా ఎక్కువ ఖర్చవుతుందని ఆందోళన చెందుతున్నాయి. నావిక్‌ అంటే నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్‌స్టిలేషన్‌ అని అర్థం. అర్థమయ్యేలా చెప్పాలంటే.. మనకు తెలియని చోటుకు వెళ్లడానికి ఫోన్‌లో ‘జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌)’ పెట్టుకొని వెళ్తాం కదా.. అలాంటిదే. అయితే, జీపీఎస్‌ వ్యవస్థ అమెరికా వాళ్ల తయారీ. దాన్ని మన సైనిక వాహనాల్లో వినియోగించడం వల్ల సైన్యం కదలికలు అమెరికాకు తెలిసిపోతాయి. కాబట్టి సైనిక అవసరాల కోసమైనా మనకంటూ ఒక సొంత నావిగేషన్‌ వ్యవస్థ అవసరం. భవిష్యత్తులో ఎప్పుడైనా మన దేశం మీద ఆంక్షల్లాంటివి విధించి.. జీపీఎస్‌ వ్యవస్థను ఉపయోగించుకోనివ్వకుండా చేస్తే సాధారణ ప్రజలకు సైతం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇరాక్‌లో అమెరికా అలాగే చేసింది. ఇలాంటి ప్రమాదాలను ఊహించే.. రష్యా తన సొంత నావిగేషన్‌ వ్యవస్థ ‘గ్లోనా్‌స’ను, చైనా బైడో అనే వ్యవస్థను, జపాన్‌ క్యూజీఎ్‌సఎస్‌, యూరప్‌ గెలీలియో అనే వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాయి. మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నావిక్‌ వ్యవస్థను రూపొందించింది. ప్రస్తుతం దీన్ని ప్రభుత్వ వాహనాల్లో అమర్చే లొకేషన్‌ ట్రాకర్స్‌లో తప్పనిసరిగా వినియోగించేలా ఆదేశాలిచ్చారు. సాధారణ ఫోన్లలో సైతం 2023 జనవరి నుంచి దీన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో యాపిల్‌, షామీ, శాంసంగ్‌ సంస్థల ప్రతినిధులు గత రెండునెలలుగా పలుమార్లు సమావేశమై చర్చించారు. నావిక్‌ కంపాటిబుల్‌ (నావిక్‌ వ్యవస్థతో అనుసంధానమై పనిచేసే) ఫోన్లను తయారు చేయాలంటే ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నావిక్‌ కోసమే కేవలం భారతదేశంలో పనిచేసేలా ప్రత్యేకంగా ఫోన్లను తయారుచేయాల్సివస్తుందని వారు చెబుతున్నారు. 2024లో లాంచ్‌ చేయాల్సిన మోడళ్ల కోసం సిద్ధమవుతున్నామని, కావాలంటే 2025 నుంచి నావిక్‌ కంపాటిబుల్‌ ఫోన్లను తయారుచేస్తామని అప్పటిదాకా సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఆ దేశాల్లో ఇప్పటికే..

‘గ్లోనా్‌స’తో అనుసంధానమై పనిచేసే స్మార్ట్‌ఫోన్లనే తమ దేశంలో విక్రయించడాన్ని రష్యా తప్పనిసరి చేసింది. అటు చైనాలో విక్రయించే స్మార్ట్‌ఫోన్లలో బైడో తప్పనిసరి కాదుగానీ.. అక్కడ ఉత్పత్తి అయ్యే చైనా కంపెనీల ఫోన్లలో 94.5ు ఆ వ్యవస్థకు అనుసంధానమై పనిచేస్తాయి. యాపిల్‌ సైతం అమెరికా, ఇతరదేశాల్లో జీపీఎ్‌సతో, రష్యాలో గ్లోనాస్‌, చైనాలో బైడోతో అనుసంధానమై పనిచేసే ఫోన్లను తయారుచేసి విక్రయిస్తోంది. కొత్తగా తయారుచేసే ఫోన్లు నావిక్‌తో అనుసంధానం కావాలంటే అందుకు ప్రత్యేకమైన చిప్‌సెట్లు కావాలి. ఆ చిప్‌సెట్లను క్వాల్‌కామ్‌ (అమెరికా), మీడియాటెక్‌ (తైవాన్‌) సంస్థలు తయారుచేస్తున్నాయి.

Read more