దర్యాప్తు సంస్థలతో ‘ఒత్తిడి’ అవాస్తవం

ABN , First Publish Date - 2022-02-23T08:19:29+05:30 IST

కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలను బీజేపీ ప్రభుత్వం ఒత్తిడికి గురి చేస్తోందన్న ఆరోపణలు నిరాధారమైనవని ఆర్థిక మంత్రి..

దర్యాప్తు సంస్థలతో  ‘ఒత్తిడి’ అవాస్తవం

కేంద్రంపై ప్రతిపక్షాల ఆరోపణలు నిరాధారం

అలా చేస్తే.. కేసీఆర్‌, ఠాక్రే, పవార్‌ కలిసేవారా?

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు


ముంబై, ఫిబ్రవరి 22: కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలను బీజేపీ ప్రభుత్వం ఒత్తిడికి గురి చేస్తోందన్న ఆరోపణలు నిరాధారమైనవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేంద్రం అలా ఒత్తిడికి గురి చేసి ఉంటే.. తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సమావేశమయ్యేవారా? అని ప్రశ్నించారు. ‘‘తమను ఒత్తిడికి గురి చేస్తున్నారంటూనే.. అందరూ కలిసి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అలాంటప్పు డు ఒత్తిడికి గురి చేసిందెక్కడ?’’ అని నిర్మల వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరితోనైనా కలవొచ్చని, అది వారి హక్కు అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. ఎక్కడైనా నేరం జరిగితేనో, మనీ లాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదైతేనో మాత్రమే ఈడీ దర్యాప్తు చేస్తుందన్నారు.  

Read more