Sidhu Moosewal Murder: మరో షూటర్, ఇద్దరు సహాయకుల అరెస్టు

ABN , First Publish Date - 2022-09-10T23:29:58+05:30 IST

సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు కీలక అరెస్టులు..

Sidhu Moosewal Murder: మరో షూటర్, ఇద్దరు సహాయకుల అరెస్టు

చండీగఢ్: సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు కీలక అరెస్టులు చేశారు. మూసేవాలా హత్యానంతరం పరారీలో ఉన్న షూటర్ దీపక్, అతని ఇద్దరు సహాయకులను అరెస్టు చేశారు. మే 29న పంజాబ్ సింగర్ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో పరారీలో ఉన్న కీలక షూటర్ దీపక్‌తో పాటు అతని సహాయకులు పండిట్, రాజేందర్‌లను పశ్చిమబెంగాల్-నేపాల్ సరిహద్దులు వద్ద శనివారంనాడు అరెస్టు చేశారు. కేంద్ర సంస్థలు, ఢిల్లీ పోలీసులతో కలిసి పంజాబ్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో వీరు పట్టుబడ్డారు.


పట్టుబడిన వారిలో దీపక్ షూటర్ కాగా, అతనికి ఆయుధాలు, దాక్కునేందుకు అవసరమైన ఏర్పాట్లను పండిట్, రాజేందర్ చూసేవారని పోలీసులు తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్య వెనుక సూత్రధారి తానేనని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మూడు నెలల క్రితం అంగీకరించారు. గత ఏడాది ఆగస్టు నుంచి అతని హత్యకు ప్లాన్ చేస్తూ వచ్చానని చెప్పారు. ఈ కేసును పంజాబ్ ప్రభుత్వం సవాలు తీసుకుని పలువురిని అరెస్టు చేసింది.

Updated Date - 2022-09-10T23:29:58+05:30 IST