CID Police: ఎస్‌ఐ పోస్టుల కుంభకోణంలో కొత్త మలుపు

ABN , First Publish Date - 2022-08-10T17:54:54+05:30 IST

ఎస్‌ఐ పోస్టుల నియామకాల అక్రమాల కుంభకోణం కొత్తమలుపు తిరిగింది. ఎస్‌ఐ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి రూ.6 కోట్లు

CID Police: ఎస్‌ఐ పోస్టుల కుంభకోణంలో కొత్త మలుపు

                                - రూ.6 కోట్ల వసూళ్లపై సీఐడీ ఆరా 


బెంగళూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐ పోస్టుల నియామకాల అక్రమాల కుంభకోణం కొత్తమలుపు తిరిగింది. ఎస్‌ఐ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి రూ.6 కోట్లు లంచంగా సేకరించారన్న కోణంలో సీఐడీ(CID) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 30 మందిని అరెస్టు చేయగా వీరిలో 8 మంది అత్యంత కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో కింగ్‌పిన్‌ డీఆర్‌ పాటిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలతో అభ్యర్థులు కళ్లప్ప, సిద్దూగౌడ, ఈరప్ప, సోమనాథ, రవిరాజా, శ్రీశైల, భగవంతరాయ్‌ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మరింత సమాచారాన్ని కూపీలాగే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా నిందితుల్లో సిద్దూగౌడ(Siddoo Gowda) ఆరోగ్యశాఖలో ఫస్ట్‌గ్రేడ్‌ అసిస్టెంట్‌గా సేవలందిస్తుండగా, కళ్లప్ప పోలీస్‌ కానిస్టేబుల్‌గాను, విజయ్‌కుమార్‌ ప్రైవేట్‌ కంపెనీలోనూ పనిచేస్తున్నట్టు గుర్తించారు. డిగ్రీ చదివిన శ్రీశైల, ర్యాంకు సాధించిన రవిరాజా కూడా ఎస్‌ఐ పోస్టుల కోసం డీల్‌ చేసినట్టు గుర్తించారు. భగవంత్‌రాయ్‌ బెంగళూరు(Bangalore)లో ఐటీ ఉద్యోగి, ఈరప్ప వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఈ 8 మంది అభ్యర్థుల నుంచి రూ.6 కోట్లు లంచంగా సేకరించిన ఆర్‌డీ పాటిల్‌ అందరికీ పరీక్షా ప్రశ్నలకు సంబంధించిన జవాబులతో కూడిన బ్లూటూత్‌ డివైజ్‌ను అందించినట్టు సీఐడీ(CID) పోలీసులు గుర్తించారు. 8 మంది వెల్లడించనున్న విషయాలు ఈకేసుకు మరింత బలం చేకూరుస్తాయని సీఐడీ పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-08-10T17:54:54+05:30 IST