పుదుచ్చేరి విద్యుత్తు సమ్మెకు శుభం కార్డు

ABN , First Publish Date - 2022-10-04T09:46:58+05:30 IST

పుదుచ్చేరిలో విద్యుత్తు ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. విద్యుత్తు పంపిణీ వ్యవస్థను 100ు ప్రైవేటీకరించేందుకు సర్కారు టెండర్లను ఆహ్వానించడంతో..

పుదుచ్చేరి విద్యుత్తు సమ్మెకు శుభం కార్డు

  • ప్రైవేటీకరణ సగమే: సీఎం రంగస్వామి
  • దీపావళి వరకు ఉద్యోగుల డెడ్‌లైన్‌ 

పుదుచ్చేరి, అక్టోబరు 3: పుదుచ్చేరిలో విద్యుత్తు ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. విద్యుత్తు పంపిణీ వ్యవస్థను 100ు ప్రైవేటీకరించేందుకు సర్కారు టెండర్లను ఆహ్వానించడంతో.. గత నెల 28 నుంచి ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో పుదుచ్చేరిలో అంధకారం నెలకొంది. ఓ దశలో ముఖ్యమంత్రి రంగస్వామి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఇళ్లకూ కరెంటు కట్‌ అయ్యింది. సోమవారం ముఖ్యమంత్రి రంగస్వామి, విద్యుత్తు శాఖ మంత్రి నమశ్శివాయమ్‌ అసెంబ్లీలో ఉద్యోగులతో చర్చలు జరిపారు. 100ు ప్రైవేటీకరణ కాకుండా.. 49ు ప్రైవేటు, 51ు ప్రభుత్వ భాగస్వామ్యం ఉండేలా కేంద్రాన్ని ఒప్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను బేషరతుగా రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన డిమాండ్‌కు సీఎం అంగీకరించారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి దీపావళి వరకు గడువు ఇస్తున్నామని, ప్రైవేటీకరణ నోటిఫికేషన్‌లో మార్పులు జరగాలని కోరారు.


సోమవారం ఉదయం విద్యుత్తు కార్యదర్శితో ఒకసారి, మంత్రితో మరోసారి చర్చలు జరిగాయి. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెండు దఫాల చర్చలు విఫలమయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రభుత్వం మరోమారు చర్చలకు ఆహ్వానించింది. ఆ సమయంలో ఎస్మా ప్రయోగంపై మంత్రివర్గ భేటీని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఆ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి విద్యుత్తు ఉద్యోగ సంఘాలతో చర్చలకు రావడం గమనార్హం.

Read more