కొత్త చరిత్ర రాయకండి

ABN , First Publish Date - 2022-01-28T08:55:24+05:30 IST

ముంబైలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు స్వాతంత్య్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్‌ పేరు పెట్టడాన్ని బీజేపీ వ్యతిరేకించడంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ విమర్శలు సంధించారు. బీజేపీ కొత్త చరిత్ర రాస్తోందంటూ చురకలు అంటించారు. మహారాష్ట్ర మంత్రి అస్లం షేక్‌ రిపబ్లిక్‌డే

కొత్త చరిత్ర రాయకండి

  • టిప్పు సుల్తాన్‌కు కోవింద్‌ కూడా నివాళి అర్పించారు
  • రాష్ట్రపతినీ రాజీనామా అడుగుతారా?
  • బీజేపీకి శివసేన ఎంపీ చురకలు


ముంబై, జనవరి 27: ముంబైలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు స్వాతంత్య్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్‌ పేరు పెట్టడాన్ని బీజేపీ వ్యతిరేకించడంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ విమర్శలు సంధించారు. బీజేపీ కొత్త చరిత్ర రాస్తోందంటూ చురకలు అంటించారు. మహారాష్ట్ర మంత్రి అస్లం షేక్‌ రిపబ్లిక్‌డే సందర్భంగా తన నియోజకవర్గంలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పేరును ‘టిప్పు సుల్తాన్‌ మైదాన్‌’గా మార్చారు. దీన్ని బీజేపీ నేతలు దేవేంద్ర ఫడణవీస్‌ తదితరులు బుధవారం ఖండించారు. హిందువులను హింసించిన వ్యక్తులను గౌరవించడం సరికాదన్నారు. పేరు మార్పును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సంజయ్‌ రౌత్‌ గురువారం స్పందించారు. ‘చరిత్ర గురించి తమకు మాత్రమే తెలుసనే భ్రమలో బీజేపీ నేతలు ఉన్నారు. కొత్త చరిత్ర రాయడానికి వారు సిద్ధమైపోతున్నారు.


టిప్పు సుల్తాన్‌ గురించి మాకూ తెలుసు. ఆయన గురించి బీజేపీ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలదు. కొత్త చరిత్ర రాయకండి. ఢిల్లీలో చరిత్రను మార్చేసే ప్రయత్నాలను మీరు కొనసాగించండి. కానీ ఇక్కడ సఫలం కాలేరు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా కర్ణాటక వెళ్లి టిప్పు సుల్తాన్‌కు నివాళి అర్పించారు. చారిత్రక వీరుడని, స్వాతంత్య్ర సమర యోధుడని కొనియాడారు. ఆయనను కూడా మీరు రాజీనామా అడగగలరా? దీనిపై బీజేపీ స్పష్టత ఇవ్వాలి. ఇదో డ్రామా’ అని సంజయ్‌రౌత్‌ ఎద్దేవా చేశారు.

Read more