Congress presidential election: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తప్పని పోటీ... బరిలో దిగేందుకు సిద్ధమైన ఆ నేత ఎవరంటే...

ABN , First Publish Date - 2022-09-24T20:41:44+05:30 IST

కాంగ్రెస్ (Congress) అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ ఎంపీ

Congress presidential election: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తప్పని పోటీ... బరిలో దిగేందుకు సిద్ధమైన ఆ నేత ఎవరంటే...

న్యూఢిల్లీ : కాంగ్రెస్ (Congress) అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) సిద్ధమయ్యారు. ఆయన ప్రతినిధి ఒకరు శనివారం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. దీంతో అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), శశి థరూర్ మధ్య పోటీ జరగబోతోంది. ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే నెల 17న ఎన్నిక జరుగుతుంది, రెండు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేరళ ఎంపీ శశి థరూర్ ఈ ఎన్నికల్లో తలపడబోతున్నారు. అశోక్ గెహ్లాట్‌కు ఆ పార్టీ అధిష్ఠానం అండదండలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో శశి థరూర్ ఒకరు. 


అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ (Madhusudan Mistry) రిటర్నింగ్ అధికారి హోదాలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని, తనకు ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను ఇవ్వాలని శశి థరూర్ రాసిన లేఖను మిస్త్రీ పరిశీలించారు. ధరూర్ ప్రతినిధి ఒకరు ఈ నామినేషన్ పత్రాలను తీసుకెళ్ళారు. 


ఇదిలావుండగా, గాంధీ కుటుంబానికి చెందని నేత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న సందర్భం 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాబోతోంది. సీతారాం కేసరి నుంచి 1998లో ఆ పార్టీ పగ్గాలను సోనియా గాంధీ స్వీకరించారు. సీతారాం కేసరి (Sitaram Kesari) 1997లో శరద్ పవార్, రాజేశ్ పైలట్‌లను ఓడించి, ఆ పదవిని చేపట్టారు. 


‘గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేయరు’

అశోక్ గెహ్లాట్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల్లో గాంధీ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయబోరని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారని, ఆ విషయాన్ని ఆయన దృష్టికి అనేకసార్లు తీసుకెళ్ళానని, అయితే ఆయన అందుకు తిరస్కరించారని చెప్పారు. కాంగ్రెస్ తదుపరి అధ్యక్షునిగా గాంధీ కుటుంబీకులెవరూ ఉండకూడదని రాహుల్ చెప్పారన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తన పోటీపై నిర్ణయం జరిగిందని, నామినేషన్ పత్రాలను ఎప్పుడు దాఖలు చేయాలో తేదీని నిర్ణయిస్తామని తెలిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాలు బలంగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. 


సోనియాతో థరూర్ భేటీ

శశి థరూర్ సోమవారం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తెలిపారు. అందుకు ఆమె బదులిస్తూ, తాను ఈ ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరిస్తానని చెప్పారు. అధికారిక అభ్యర్థి ఉంటారనే అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. ఎక్కువ మంది పోటీ చేయాలన్న ఆలోచనను స్వాగతించారు. 


నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబరు 30. ఎన్నికలు అక్టోబరు 17న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు అక్టోబరు 19న జరుగుతుంది. 


Updated Date - 2022-09-24T20:41:44+05:30 IST