షార్జా-హైదరాబాద్‌ విమానం.. కరాచీలో అత్యవసర ల్యాండింగ్‌

ABN , First Publish Date - 2022-07-18T07:15:34+05:30 IST

షార్జా నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో..

షార్జా-హైదరాబాద్‌ విమానం.. కరాచీలో అత్యవసర ల్యాండింగ్‌

అంత్యక్రియలకు వస్తున్న ఇద్దరికి.. ఒకరోజు ఆలస్యం?

ఎయిరిండియా విమానం మస్కట్‌కు..

వరుస ఘటనలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమీక్ష


కరాచీ, శంషాబాద్‌రూరల్‌, జూలై 17: షార్జా నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో.. పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఇండిగోకు చెందిన విమానం(6ఈ-1406) శనివారం రాత్రి షార్జా నుంచి బయలుదేరాక.. మార్గమధ్యంలో సాంకేతిక లోపాలు తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. దీంతో.. కరాచీ విమానాశ్రయ ఏటీసీ అనుమతితో ఆ ఎయిర్‌పోర్టులో విమానాన్ని దింపారు. భారత్‌కు చెందిన విమానం ఇలా పాక్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ కావడం గడచిన రెండు వారాల్లో ఇది రెండోసారి. గత వారం స్పైస్‌జెట్‌కు చెందిన ఢిల్లీ-దుబాయ్‌ విమానం కూడా ఇంధన ట్యాంకులో లోపాలతో కరాచీలో ల్యాండ్‌ అయింది. ఇలాంటివే అనేక వరుస ఘటనల నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. వీటిపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నిర్లక్ష్యంతో.. కరాచీ ఎయిర్‌పోర్టులోని రన్‌వేపై దాదాపు 8 గంటలు నరకాన్ని చవిచూశామని ప్రయాణికులు ఆరోపించారు. చివరికి మరో విమానంలో 184 మంది ప్రయాణికులను తరలించగా.. ఆదివారం రాత్రికి వారు శంషాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు ‘ఆంధ్రజ్యోతి’తో తమ ఆవేదనను తెలిపారు. తమ తండ్రి అంత్యక్రియల కోసం వస్తున్న ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, ఈ ఘటనతో కడచూపు దక్కించుకోలేకపోయామంటూ విలపించారు. సాంకేతికలోపం అని తెలిసి బిక్కుబిక్కుమంటూ గడిపామని విజయవాడకు చెందిన హరిత తెలిపారు.

Read more