People of 7 villages: మా ప్రాంతంలో విమానాశ్రయం వద్దు

ABN , First Publish Date - 2022-10-03T12:40:05+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా పరందూరులో ఏర్పాటు చేయాలనుకుంటున్న విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఏడు గ్రామాల వారు సభల్లో తీర్మాణం

People of 7 villages: మా ప్రాంతంలో విమానాశ్రయం వద్దు

                            - పరందూరు ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా 7 గ్రామసభల్లో తీర్మానం


చెన్నై, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా పరందూరులో ఏర్పాటు చేయాలనుకుంటున్న విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఏడు గ్రామాల వారు సభల్లో తీర్మాణం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం తిరువళ్లూరు, కాంచీపురం, తిరువళ్లూరు(Tiruvallur, Kanchipuram, Tiruvallur) జిల్లాల్లో 1159 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయి. కాంచీపురం జిల్లాలో 274 గ్రామసభలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏకనాపురం, మేలేరి, నెలవాయి, వలత్తూరు, పరందూరు, నాగపట్టు సహా ఏడుగ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో పరందూరు విమానాశ్రయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. మొదట ఏకనాపురంలో గ్రామీణాభివృద్ధి అధికారి గోపి, శ్రీపెరంబుదూరు తహసీల్దార్‌ జయకాంతన్‌ సమక్షంలో జరిగిన సభలో స్థానిక సమస్యలపై గ్రామస్థులు అధికారులతో చర్చించారు. ఆ తర్వాత కొత్త విమానాశ్రయం ఏర్పాటు వల్ల తమ గ్రామం సహా 13 గ్రామాల్లో పొలాలను కోల్పోవలసి వస్తుందని, ఈ పరిస్థితుల్లో ఆ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయకూడదంటూ తీర్మానం చేయాలని ఏకనాపురం గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించకూడదని అధికారులు వ్యతిరేకించారు. కానీ సభలో పాల్గొన్న వందలాదిమంది గ్రామస్థులంతా మూకుమ్మడిగా విమానాశ్రయానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని ఆమోదించాల్సిందేనంటూ పట్టుబట్టారు. ప్రభుత్వ ఆదేశం మేరకు గ్రామసభల్లో స్థానికులు చేసిన తీర్మానాలను ఆమోదించి తీరాల్సిందేనని పట్టుబట్టారు. చివరకు విమానాశ్రయానికి వ్యతిరేకంగా ప్రజల తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే విధంగా మేలేరి, నెలవాయి, వలత్తూరు, పరందూరు, నాగపట్టు గ్రామాల్లో కూడా విమానాశ్రయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి ఆమోదింపజేశారు. ఇదిలా ఉండగా పరందూరు విమానాశ్రయం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏకనాపురం సహా 13 గ్రామాలకు చెందిన ప్రజలు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు, ధర్నాలు ఆదివారం 67 రోజుకు చేరింది. ఓ వైపు గ్రామసభలు జరుగుతుండగానే మరోవైపు ఆ గ్రామాల ప్రజలు రిలేనిరాహార దీక్షను కొనసాగించారు.  

Updated Date - 2022-10-03T12:40:05+05:30 IST