Setback Uddhav: 12 మంది శివసేన రాష్ట్ర యూనిట్ అధ్యక్షులు షిండే క్యాంపులో చేరిక

ABN , First Publish Date - 2022-09-16T21:04:29+05:30 IST

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శివసేన పార్టీ 15 రాష్ట్ర విభాగాల..

Setback Uddhav: 12 మంది శివసేన రాష్ట్ర యూనిట్ అధ్యక్షులు షిండే క్యాంపులో చేరిక

ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Tackeray)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శివసేన పార్టీ 15 రాష్ట్ర విభాగాల అధ్యక్షుల్లో 12 మంది ముఖ్యమంత్రి, తిరుగుబాటు శివసేన వర్గం నేత ఏక్‌నాథ్ షిండే (Eknath shinde) క్యాంపులో చేరారు. ఈనెల 15న జరిగిన ఒక సమావేశంలో షిండే క్యాంపులో వీరంతా చేరారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు అవసరమైన సాయం అందిస్తామని ముఖ్యమంత్రి షిండే ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.


షిండేకు మద్దతు ప్రకటించిన వారిలో శివసేన రాష్ట్ర యూనిట్ చీఫ్‌లలో ఢిల్లీ శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ చౌదరి, మణిపూర్ చీఫ్ తొంబి సింగ్, మధ్యప్రదేశ్ చీఫ్ తాడేశ్వర్ మహావర్, ఛత్తీస్‌గఢ్ చీఫ్ ధనంజర్ పరిహార్, గుజరాత్ చీఫ్ ఎస్ఆర్ పాటిల్, రాజస్థాన్ చీఫ్ లఖన్ సింగ్ పవార్, హైదరాబాద్ చీఫ్ మురారి అన్న, గోవా ముఖ్యమంత్రి జితేష్ కామత్, కర్ణాటక చీఫ్ కుమార్ ఎ హకరి, పశ్చిమబెంగాల్ చీఫ్ శాంతి దత్తా, ఒడిశా రాష్ట్ర ఇన్‌చార్జి జ్యోతిశ్రీ ప్రసన్న కుమార్, త్రిపుర రాష్ట్ర ఇన్‌చార్జి బరివదేవ్ నాథ్ ఉన్నారు.


పార్టీ గుర్తు తమకే చెందాలంటూ షిండే గ్రూపు చేసిన వాదనపై ఎన్నికల కమిషన్‌‌ను మందుకు వెళ్లకుండా చూడాలని కోరుతూ ఉద్ధవ్ థాకరే వర్గం వేసిన పిటిషన్‌ మరో వారంలో సుప్రీంకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గత జూన్ 30న ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Updated Date - 2022-09-16T21:04:29+05:30 IST