Koshyari Ramarks: ఆయనను జైలుకో, ఇంటికో పంపే సమయం వచ్చింది: ఉద్ధవ్

ABN , First Publish Date - 2022-07-31T01:49:33+05:30 IST

హారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారి ముంబై ఆర్థిక స్థితిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన ..

Koshyari Ramarks: ఆయనను జైలుకో, ఇంటికో పంపే సమయం వచ్చింది: ఉద్ధవ్

ముంబై: మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారి (Bhagat sing koshyari) ముంబై ఆర్థిక స్థితిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddav Thackeray) తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనను ఇంటికి కానీ , జైలుకు కానీ పంపే సమయం ఆసన్నమైందని అన్నారు. గవర్నర్ కోష్యారి శుక్రవారంనాడు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను వీడి వెళ్లితే, ముఖ్యంగా ముంబై, థానేను విడిచిపెడితే, ముంబైలో డబ్బేం మిగలదని, దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత ముంబై కోల్పోతుందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.


హిందువులను విడగొడుతున్నారు...

గవర్నర్‌ వ్యాఖ్యలపై ఉద్ధవ్ తన నివాసమైన మాతోశ్రీ మీడియాతో మాట్లాడుతూ, మరాఠీ ప్రజలపై ఆయనకున్న విద్వేష భావన బయటపడిందని అన్నారు. మరాఠా ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పితీరాలన్నారు. థానే, ముంబైలో హిందువులను విడిగొట్టేందుకు గవర్నర్ ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరిని సమానంగా చూడాల్సిన బాధ్యతను గవర్నర్ విస్మరించారని, కులం, వర్గం, మతం అనే తేడాల్లేకుండా దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న హిందువుల మధ్య చీలక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన ఇంటికి పంపాలా, జైలుకు పంపాలా తేలే సమయం ఆసన్నమైందని అన్నారు. గత మూడేళ్లుగా ఆయన మహారాష్ట్రలో ఉంటూనే మరాఠా మాట్లాడే వాళ్లను అనుమానిస్తూనే ఉన్నారని అన్నారు. ఆయన ఇప్పుడు మాట్లాడిన మాటలు ఆయన గవర్నర్ గిరీకి అగౌరవం తెచ్చేలా ఉన్నాయని అన్నారు. 1992లో అల్లర్లు చెలరేగినప్పుడు థానే, ముంబైలో ఉన్న హిందువులను శివసేన కాపాడిందని, వాళ్లు మరాఠీ వాళ్లా, కాదా అనేది ఏమాత్రం చూడలేదని గుర్తుచేశారు. గవర్నర్ పదవి పెద్ద పదవి అని, దానికి కించపరచాలని తాను కోరుకోవడ లేదని, అయితే ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఆ పదవికి గౌరవం తెచ్చేలా ఉండాలని ఉద్ధవ్ అన్నారు. ఢిల్లీలో ఉంటున్న కొందరు ముంబైపై కన్నేశారని, ముంబైలోని సంపదే ఇందుకు కారణమని, అదే విషయాన్ని గవర్నర్ బహిరంగంగా చెప్పారని ఉద్ధవ్ అన్నారు. కొన్ని సమయాల్లో ఆయన అతిచురుగ్గా వ్యవహరిస్తారని, కొన్ని సార్లు అస్సల కదలికలే ఉండవని చెప్పారు. ఆయన కోటాలో ఖాళీగా ఉన్న 12 సీట్లను ఇప్పటి వరకూ భర్తీ చేయలేదని అన్నారు. ఆయనకు ఇష్టం లేకుంటే ఆ పోస్టుల విషయం రాష్ట్రపతికి తెలియజేసి, రద్దు చేయించాలని అన్నారు.

Updated Date - 2022-07-31T01:49:33+05:30 IST