ఈడీ అదుపులో సంజయ్‌ రౌత్‌

ABN , First Publish Date - 2022-08-01T07:54:44+05:30 IST

మహారాష్ట్ర తాజా మాజీ సీఎం, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అదుపులోకి తీసుకుంది.

ఈడీ అదుపులో సంజయ్‌ రౌత్‌

వెయ్యి కోట్ల భూకుంభకోణంలో ఈడీ చర్యలు

ఉదయం నుంచి సంజయ్‌ నివాసంలో సోదాలు

ఆయన ఇంట్లో రూ.11.50 లక్షల నగదు సీజ్‌

బాలాసాహెబ్‌ సాక్షిగా నేను తప్పుచేయలే: రౌత్‌


ముంబై, జూలై 31: మహారాష్ట్ర తాజా మాజీ సీఎం, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అదుపులోకి తీసుకుంది. రూ.1,034 కోట్ల భూ కుంభకోణానికి సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించి గత నెల(జూలై) 1న సంజయ్‌ రౌత్‌ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆయన్ను విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు రెండు సార్లు సమన్లు జారీ చేశారు. చివరి సారి గత నెల 27న సమన్లు పంపగా.. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో రాలేనని సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. దాంతో.. ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు కేంద్ర సాయుధ బలగాల భద్రత నడుమ భాండు్‌పలోని సంజయ్‌ రౌత్‌ ఇంటి(మైత్రి)కి చేరుకున్నారు. ఉదయం నుంచి పత్రాచాల్‌ రీ-డెవల్‌పమెంట్‌కు సంబంధించిన రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణంపై ఆయనపై ప్రశ్నలు సంధించారు. రౌత్‌ ఇంట్లోంచి రూ. 11.50 లక్షలను సీజ్‌ చేసినట్లు ఈడీ వివరించింది. ఆ మొత్తం గురించి సంజయ్‌రౌత్‌ను ప్రశ్నించగా.. రూ. 10 లక్షలు పార్టీకి సంబంధించినవని.. రూ. 1.50 లక్షలు తన ఇంటి మరమ్మతులకు ఉద్దేశించినవని ఆయన వివరించారని ఈడీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం వరకు పలు కోణాల్లో విచారణ కొనసాగింది. 


ఈ కేసులో ఈడీ ఏప్రిల్‌ నెలలో సంజయ్‌ సతీమణి వర్ష రౌత్‌, ఆయన ఇద్దరు సన్నిహితులు సుజిత్‌ పట్కర్‌, ప్రవీణ్‌ రౌత్‌లకు సంబంధించిన రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. దాదర్‌ ప్రాంతంలోని వర్ష రౌత్‌కు చెందిన ఓ ఫ్లాట్‌, ఆమెకు, సుజిత్‌ పట్కర్‌ భార్య స్వప్న పట్కర్‌కు ఉమ్మడిగా అలీబాగ్‌లోని కిహిం బీచ్‌ వద్ద ఉన్న ఎనిమిది 8 స్థలాలు ఈడీ జప్తులో ఉన్నాయి. సుజిత్‌ పట్కర్‌, ఆయన భార్య స్వప్న పట్కర్‌, ప్రవీణ్‌ రౌత్‌తో సం జయ్‌ రౌత్‌కు ఉన్న సాన్నిహిత్యం, ఇతర వ్యాపార సంబంధాల గురించే ఈడీ సంజయ్‌ రౌత్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. పట్రా చావల్‌ రీడెవల్‌పమెంట్‌లో గురు ఆశీష్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమేయం ఉందని, 47 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 672 మంది కౌలుదారులు అద్దెకు ఉంటున్నారని ఈడీ తెలిపింది. అయితే.. ఆ భూమి మహారాష్ట్ర హౌసింగ్‌ ఏరియా డెవల్‌పమెంట్‌కు చెందినదని పేర్కొంది. రౌత్‌ను ఈడీ విచారిస్తున్నంత సేపు.. శివసేన(ఉద్ధవ్‌ వర్గం) కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద సంజయ్‌ను సుమారు 9 గంటలు అధికారులు ప్రశ్నించారు. కడపటి వార్తలందేసరికి.. ముంబైలోని ఈడీ ఆఫీసు నాలుగో అంతస్తులో రౌత్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.


అయితే అంత భయమెందుకు: షిండే, బీజేపీ

సంజయ్‌ రౌత్‌ తనను తాను అమాయకుడినని చేసిన ట్వీట్లపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తీవ్రంగా స్పందించారు. ఒకవేళ రౌత్‌ అమాయకుడే అయితే.. ఈడీ చర్యల పట్ల భయపడొద్దని ఆదివారం అన్నారు. రౌత్‌ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తాను షిండే శిబిరంలో చేరడం వల్ల ఈడీ భయం లేదంటూ అర్జున్‌ ఖోట్కర్‌ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. ‘‘మేము అతణ్ని ఆహ్వానించలేదు. ఎవరైనా గానీ.. ఈడీ భ యంతో మా వద్దకు గానీ, బీజీపీ వద్దకు గానీ రావొద్దని కోరుతున్నా’’ అని షిండే వ్యాఖ్యానించారు. శివసేన పార్టీని ఖతం చేసే కుట్ర జరుగుతోందని తాజా మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. ఈ క్రమంలోనే రౌత్‌ను అదుపులోకి తీసుకున్నారని అన్నారు.


నేను ఏ తప్పూ చేయలేదు: రౌత్‌

ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని సంజయ్‌ రౌత్‌ ముందు నుంచి చెబుతూ వచ్చారు. పోలీసులు అరెస్టు చేసి, తీసుకెళ్తున్న సమయంలో తన ఇంటి బయట ఉన్న శివసేన కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. తాజా పరిస్థితిని వివరిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘‘బాలాసాహెబ్‌ సాక్షిగా చెబుతున్నాను. నేను ఏ తప్పూ చేయలేదు. నాపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. శివసేనను వీడేది లేదు. నేను చచ్చినా.. ఈడీకి లొంగే ప్రసక్తే లేదు. రాజకీయ కుట్రలో భాగంగానే నాపై దాడులు జరుగుతున్నాయి. శివసేన కోసం పోరాటం సాగిస్తూనే ఉంటా’’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు.. ఒత్తిడి వల్లే రెబెల్‌ వర్గానికి వెళ్లానని అర్జున్‌ ఖోట్కర్‌ చెప్పినట్లు గుర్తుచేశారు. బీజేపీలో చేరిన నేతలపై ఈడీ, ఆదాయపన్నుశాఖ దర్యాప్తు, విచారణ ఎక్కడిదాకా వచ్చిందో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ఆ డబ్బు నాది కాదు: పార్థ ఛటర్జీ

కోల్‌కతా: బెంగాల్‌లో టీచర్ల నియామక కుంభకోణం కేసులో తనతో పాటు అరెస్టయిన నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో బయటపడిన డబ్బు తనది కాదని బెంగాల్‌ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ పేర్కొన్నారు. తనపై ఎవరు కుట్ర చేస్తున్నారో కాలమే సమాధానం చెబుతుందన్నారు. అధికారులు ఆయనను కోల్‌కతా శివారులోని జోకాలోని ఈఎ్‌సఐ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకురాగా.. అక్కడ విలేకరులతో మాట్లాడారు. కాగా, అర్పిత ముఖర్జీ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అర్పిత వినియోగించిన రెండు జీఎస్టీ నంబర్లపై సంస్థ ఇప్పుడు ప్రధానంగా దృష్టిపెట్టింది.  వీటి సహాయంతో అర్పిత వివిధ వ్యక్తులు, సంస్థలతో జరిపిన లావాదేవీల వివరాలను తెలుసుకోవచ్చని ఈడీ ధీమాగా ఉంది. 

Updated Date - 2022-08-01T07:54:44+05:30 IST