ఉక్రెయిన్‌పై అదే కసి

ABN , First Publish Date - 2022-10-12T07:33:31+05:30 IST

అత్యంత కీలక వంతెన ‘కెర్చ్‌’ పేల్చివేతపై పగతో రగిలిపోతున్న రష్యా.. ఉక్రెయిన్‌ మీద తన కసి చూపుతోంది.

ఉక్రెయిన్‌పై అదే కసి

రెండో రోజూ రష్యా దాడులు

జాపోరిజ్జియా, ల్వీవ్‌పై క్షిపణుల వాన

కీవ్‌, అక్టోబరు 11: అత్యంత కీలక వంతెన ‘కెర్చ్‌’ పేల్చివేతపై పగతో రగిలిపోతున్న రష్యా.. ఉక్రెయిన్‌ మీద తన కసి చూపుతోంది. వరుసగా రెండో రోజూ దాడులకు దిగింది. మంగళవారం ఉక్రెయిన్‌ సైనిక స్ధావరాలు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటూ అత్యంత కచ్చితమైన, దీర్ఘశ్రేణి ఆయుధాలను ప్రయోగించింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది. మంగళవారం జాపోరిజ్జియా నగరంపై 12 ఎస్‌-300 క్షిపణులను ప్రయోగించింది. పశ్చిమ ఉక్రెయిన్‌లోని ల్వీవ్‌ రీజియన్‌లో  రెండు ఇంధన కేంద్రాలపై మూడు క్షిపణులను వదిలింది. దీంతో ల్వీవ్‌ నగరమంతా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఉద్రికత్తల నేపథ్యంలో ఉక్రెయిన్‌ వ్యాప్తంగా మంగళవారం అత్యవసర సర్వీసుల హై అలర్ట్‌ ప్రకటించారు. కాగా, యుద్ధ ప్రారంభం నుంచి రష్యాకు మద్దతుగా నిలుస్తున్న ఉక్రెయిన్‌ పొరుగు దేశం అనుమానాస్పద చర్యకు దిగింది. రష్యన్‌ బలగాలకు తోడుగా తమ సైన్యాన్నీ సరిహద్దుల్లో మోహరించింది. ఇది కేవలం రక్షణ కోసమే అని చెబుతున్నప్పటికీ.. ఆ మాటలు నమ్మదగ్గవిగా లేవు. ఇక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా మంగళవారం ప్రకటించింది. 


రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు

ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాలను విలీనం చేసుకుంటున్నట్లు రష్యా ప్రకటన చేయడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ)లో ఓటింగ్‌ జరిగింది. ఈ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అల్బేనియా.. రికార్డెడ్‌ ఓటింగ్‌ చేపట్టాలని కోరింది. రష్యా మాత్రం రహస్య బ్యాలెట్‌కు పట్టుపట్టింది. దీనిపై ఓటింగ్‌ జరగ్గా.. రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది. మరో 106 దేశాలు ఇదే నిర్ణయం తీసుకున్నాయి. 

Read more