ఖార్కివ్‌లో బందీలుగా 3వేల మంది భారతీయులు

ABN , First Publish Date - 2022-03-04T17:14:17+05:30 IST

ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంలో భారతీయ విద్యార్థులు బందీలుగా ఉన్నారా? ఉక్రెయిన్‌ సేనల చెరలో గానీ రష్యా సేనల చెరలో గానీ వారు చిక్కుకున్నారా? ఇలా ఉక్రెయిన్‌ మీద రష్యా..

ఖార్కివ్‌లో బందీలుగా 3వేల మంది భారతీయులు

వారంతా ఉక్రెయిన్‌ సైన్యం చెరలోనే.. సాక్ష్యాలున్నాయ్‌..

ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 

ఖండించిన భారత్‌.. ఏ ఒక్కరు బందీగా లేరని స్పష్టం 


న్యూఢిల్లీ, మార్చి 3: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంలో భారతీయ విద్యార్థులు బందీలుగా ఉన్నారా? ఉక్రెయిన్‌ సేనల చెరలో గానీ రష్యా సేనల చెరలో గానీ వారు చిక్కుకున్నారా? ఇలా ఉక్రెయిన్‌ మీద రష్యా.. ఆ దేశం మీద ఉక్రెయిన్‌ చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం గట్టిగా ఖండించింది. ఏ ఒక్కరూ బందీలుగా ఉన్నట్లుగా తమకు ఎలాంటి నివేదికా రాలేదని స్పష్టం చేసింది. అయితే దీనికి విరుద్ధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గురువారం రాత్రి చేసిన ప్రకటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖార్కివ్‌లో ఉక్రెయిన్‌ సేనలు 3వేల మందికిపైగా భారత పౌరులను బందీలుగా చేసుకున్నాయని పుతిన్‌ స్పష్టం చేశారు. ఈ విషయమ్మీదే గురువారం ఉదయం పుతిన్‌ కార్యాలయం చేసిన ప్రకటన ఆందోళన రేకెత్తించింది. రష్యా ప్రాదేశిక భూభాగం వైపు వెళ్లనీయకుండా చేసేందుకు భారత విద్యార్థుల్లో కొందరిని ఉక్రెయిన్‌ సైన్యం బంధించిందని ఆ ప్రకటనలో రష్యా స్పష్టం చేసింది. ఆ వెంటనే ఉక్రెయిన్‌ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌, పాకిస్థాన్‌, చైనా తదితర దేశాలకు చెందిన విద్యార్థులను రష్యా సైన్యం బంధించిందని.. వారంతా ఖార్కివ్‌, సూమె నుంచి సురక్షితంగా ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలకు తరిలేలా సహకరించాలంటూ రష్యాను డిమాండ్‌ చేసింది.


ఇలా ఇరుదేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నా.. ఈ వార్తల్లో నిజం లేదంటూ భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పుతిన్‌ తాజా ప్రకటన మళ్లీ కలవరపెడుతోంది. అదే సమయంలో ఖార్కివ్‌ నుంచి రైళ్లలో వెళుతున్న  తమను కిందకి తోసేస్తునన్నారని కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. కాగా ఖార్కివ్‌, సూమె నగరాల్లోని భారత్‌ సహా విదేశాలకు చెందిన విద్యార్థుల కోసం రష్యా 130 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. ఈ బస్సుల ద్వారా ఖార్కివ్‌, సూమెలోని విదేశీ విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి తూర్పుగా ప్రయాణించి రష్యా సరిహద్దు ప్రాంతమైన బెల్‌గర్డ్‌ సమీపంలోని రెండు చెక్‌పోస్టులకు తరలుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఒక్క ఖార్కివ్‌ నగరంలోనే దాదాపు 8వేల మంది భారతీయులు ఉన్నారు. ఖార్కీవ్‌ను వీడుతున్న భారతీయులు తప్పనిసరిగా ఓ ఆన్‌లైన్‌ దరఖాస్తును భర్తీచేయాలని అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులు సూచిస్తున్నారు.  


19 విమానాల్లో నేడు స్వదేశానికి 3,726 మంది

‘ఆపరేషన్‌ గంగ’ కింద ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల నుంచి గురువారం 19 విమానాల్లో 3,726 మంది విద్యార్థులను భారత్‌కు తరలిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వెల్లడించారు. ఎనిమిది విమానాలను రొమేనియా రాజధాని బుకారెస్ట్‌ నుంచి.. రొమేనియా నగరం సుసేవా నుంచి,  స్లొవేకేయా నగరం కొషిత్స నుంచి ఒకటి చొప్పున... హంగరీ రాజధాని బుడాపెస్ట్‌ నుంచి ఐదు విమానాలు, పొలండ్‌లోని ఝేషుఫ్‌ నుంచి రెండు విమానాలు విద్యార్థులతో భారత్‌కు వస్తాయన్నారు. కాగా గురువారం ఐదు విమానాల ద్వారా 981 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల నుంచి భారత్‌కు తిరొగొచ్చారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో బంకర్లు, బాంబు షెల్టర్లు, బేస్‌మెంట్స్‌లలో సురక్షితంగా ఎలా ఉండాలన్న విషయమ్మీద కేంద్రం ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు చేరుకున్న యూపీకి చెందిన కొందరు విద్యార్థులతో ప్రధాని మోదీ మాట్లాడారు. 

Read more