820మందికి మోసం రష్యా హ్యాకర్‌ సహకారం

ABN , First Publish Date - 2022-10-05T10:17:43+05:30 IST

గత ఏడాది జరిగిన ఐఐటీ-జేఈఈ కుంభకోణంలో కీలక నిందితుడైన రష్యా పౌరుడు మిఖాయిల్‌ షార్గిన్‌, విచారణకు సహకరించడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తాజాగా కోర్టుకు తెలిపింది.

820మందికి మోసం రష్యా హ్యాకర్‌ సహకారం


న్యూఢిల్లీ, అక్టోబరు 4: గత ఏడాది జరిగిన ఐఐటీ-జేఈఈ కుంభకోణంలో కీలక నిందితుడైన రష్యా పౌరుడు మిఖాయిల్‌ షార్గిన్‌, విచారణకు సహకరించడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తాజాగా కోర్టుకు తెలిపింది. అతడిని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిని ఢిల్లీ కోర్టులో హాజరుపరిచింది. ఇప్పటి వరకూ 20మంది విద్యార్థులు గత ఏడాది జేఈఈ పరీక్షల్లో మోసానికి పాల్పడ్డారని అధికారులు భావిస్తూ వచ్చారు. కానీ వాస్తవానికి ఆ సంఖ్య 820మందిగా ఉన్నట్లు తాజాగా గుర్తించామని, ఆ మోసానికి మిఖాయిల్‌ సహకరించాడని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి వెల్లడించారు.


గత ఏడాది సెప్టెంబరులో సుమారు 9 లక్షల మంది రాసిన జేఈఈ ఆన్‌లైన్‌ పరీక్షకు సంబంధించి అతడు హ్యాకింగ్‌ చేసి, కొందరు విద్యార్థులకు లబ్ధి చేకూర్చడంలో కీలక పాత్ర వహించాడని వారు పేర్కొన్నారు. కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే 24 మందిని సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ వాదనలు ఆలకించిన అనంతరం కోర్టు షార్గిన్‌కు రెండు రోజుల కస్టడీ విధించింది. మరోవైపు.. తన సమక్షంలోనే తన వస్తువులను పరిశీలించాలని షార్గిన్‌ కోర్టును కోరాడు.

Updated Date - 2022-10-05T10:17:43+05:30 IST