రష్యా.. భీకర దాడికి తెగించొచ్చు

ABN , First Publish Date - 2022-06-12T07:49:53+05:30 IST

తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాన్‌ రీజియన్‌ను ఎలాగైనా పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవాలని ప్రయతిస్తున్న రష్యా..

రష్యా.. భీకర దాడికి తెగించొచ్చు

అదే జరిగితే పెను విధ్వంసం.. యూకే, ఉక్రెయిన్‌ అంచనా

కీవ్‌, జూన్‌ 11: తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాన్‌ రీజియన్‌ను ఎలాగైనా పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవాలని ప్రయతిస్తున్న రష్యా.. భీకర దాడులకు దిగుతోంది. అయితే, ఉక్రెయిన్‌ సైన్యం ప్రతిఘటనతో రష్యా అనుకున్నంత తొందరగా ముందడుగు వేయలేకపోతోంది. దీంతో అత్యంత తీవ్ర స్థాయిలో విధ్వంసం సృష్టించే ఆయుధాలను ప్రయోగించేందుకూ వెనుకాడబోదనే కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా కేహెచ్‌-22 క్షిపణులను ప్రయోగించే ప్రమాదం ఉందని బ్రిటీష్‌ రక్షణ శాఖ, ఉక్రెయిన్‌ ప్రభుత్వం శనివారం పేర్కొన్నాయి. 6.1 టన్నుల బరువుండే కేహెచ్‌-22 క్షిపణులు.. 1960 దశకం సోవియట్‌ కాలం నాటివి. అణు వార్‌హెడ్‌లను ఉపయోగించి విమాన వాహక నౌకలను ధ్వంసం చేయడం వీటి వినియోగంలో ప్రధాన ఉద్దేశం. అయితే, ఇదే క్షిపణుల ద్వారా సంప్రదాయక వార్‌హెడ్‌లతో భూమ్మీద లక్ష్యాలపై దాడి చేస్తే ఆస్తుల ధ్వంసం, ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. కాగా, సీవీరోడోనెట్స్క్‌ సమీపంలోని వ్రుబివ్కా గ్రామంలో రష్యా.. మంటలు రేపే ఆయుధాలతో దాడి చేసిందని లుహాన్స్క్‌ గవర్నర్‌ సెర్గీ హైదీ తెలిపారు. డొనెట్స్క్‌ రీజియన్‌లో ఒక్క రాత్రిలో 13 నగరాలు, గ్రామాలపై ర ష్యా దాడులు చేసింది. కాగా, రష్యా దురాక్రమణ గురించి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ముందే అప్రమత్తం చేశామని, కానీ ఆయన పట్టించుకోలేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ పేర్కొన్నారు. కొన్ని యూరప్‌ దేశాలైతే దీనిని నమ్మనే లేదని వ్యాఖ్యానించారు. లాస్‌ ఏంజెల్స్‌లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్‌ ఈ మేరకు మాట్లాడారు. తాను అతిగా ఊహిస్తున్నట్లు భావించారన్నారు. 

Read more