ఆక్రమిత ఉక్రెయిన్‌లో రష్యా రిఫరెండం షురూ

ABN , First Publish Date - 2022-09-24T07:59:27+05:30 IST

సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌పై సరిగ్గా ఏడు నెలల కిందట యుద్ధానికి దిగిన రష్యా తన పంతాన్ని నెగ్గించుకునే క్రమంలో కీలక అడుగు వేసింది.

ఆక్రమిత ఉక్రెయిన్‌లో రష్యా రిఫరెండం షురూ

మాస్కో, కీవ్‌, సెప్టెంబరు 23: సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌పై సరిగ్గా ఏడు నెలల కిందట యుద్ధానికి దిగిన రష్యా తన పంతాన్ని నెగ్గించుకునే క్రమంలో కీలక అడుగు వేసింది. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌, డొనెట్స్క్‌, దక్షిణాన ఉన్న జాపొరిజ్జియా, ఖేర్సన్‌లో శుక్రవారం నుంచి ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) మొదలుపెట్టింది. వచ్చే మంగళవారం వరకు పూర్తిగా పుతిన్‌ సైన్యం, వారి అనుకూలురైన స్థానిక తిరుగుబాటు నేతల కనుసన్నల్లో ఈ ప్రక్రియ సాగనుంది. ఇంటి నుంచే ఓటు వేయాలని.. బ్యాలెట్‌ బాక్సులను తాము వచ్చి తీసుకెళ్తామని లుహాన్స్క్‌, జాపోరిజ్జియాల్లో ప్రజలకు అధికారులు తెలిపారు.  రిఫరెండంలో వచ్చే ‘సానుకూల’ ఫలితాన్ని చూపి రష్యా ఈ ప్రాంతాలను కలిపేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే.. ఉక్రెయిన్‌ దాదాపు 18 శాతం భూభాగాన్ని కోల్పోనుంది. కాగా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించగల సత్తా భారత ప్రధాని మోదీకి ఉందని మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్‌ అన్నారు.

Read more