Punjab : పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి... పాకిస్థాన్‌‌ లింక్ ఉందా?...

ABN , First Publish Date - 2022-12-10T10:32:21+05:30 IST

పంజాబ్‌లోని తరన్ తరన్ (Punjab’s Tarn Taran) పోలీస్ స్టేషన్‌పై శుక్రవారం-శనివారం మధ్య రాత్రి 1 గంటకు

Punjab : పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి... పాకిస్థాన్‌‌ లింక్ ఉందా?...
Punjab Tarn Taran

చండీగఢ్ : పంజాబ్‌లోని తరన్ తరన్ (Punjab’s Tarn Taran) పోలీస్ స్టేషన్‌పై శుక్రవారం-శనివారం మధ్య రాత్రి 1 గంటకు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ దాడి జరిగింది. ఇది ఈ పోలీస్ స్టేషన్ భవనం వెలుపల ఉన్న ఓ స్తంభానికి తగిలి, వెనుకకు వెళ్ళడంతో నష్టం తీవ్రత తగ్గింది. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్, ఫోరెన్సిక్ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి.

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఐఎస్ఐ (Pakistan ISI) ప్రాపకంతో, ఖలిస్థాన్ మద్దతుతో పని చేస్తున్న ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్, ఖలిస్థానీ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ వురపు రిండా (Harvinder Singh alias Rinda) ఇటీవల పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడని తెలుస్తోంది. ఈ హత్యకు బాధ్యత తమదేనని మరో గ్యాంగ్‌స్టర్ దవీందర్ బంబిహ గ్రూప్ ప్రకటించింది. రిండా హత్యకు ప్రతిస్పందనగా ఈ పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడం కోసం పాకిస్థాన్ ఐఎస్ఐ ఈ దాడి చేయించినట్లు భావిస్తున్నారు.

పంజాబ్‌లోని మొహాలీలో పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై ఆర్‌పీజీ దాడి కేసులో రిండా ప్రధాన సూత్రధారి. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా రిండాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనేక ఉగ్రవాద కేసుల్లో రిండా నిందితుడు. ఆయన నిషిద్ధ ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడు కూడా.

ఇదిలావుండగా, పంజాబ్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, హర్వీందర్ సింగ్ రిండా లాహోర్ ఆసుపత్రిలో సుమారు 15 రోజులపాటు మూత్రపిండాల వ్యాధికి చికిత్స పొంది, మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా, ఈ దాడి జరిగిన సమయంలో ఈ పోలీస్ స్టేషన్‌లో 9 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ దాడిపై బీజేపీ స్పందిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - 2022-12-10T10:36:42+05:30 IST