అర్ధ రాత్రి ఆర్తనాదాలు

ABN , First Publish Date - 2022-09-19T17:14:05+05:30 IST

బస్సులో ప్రశాంతంగా నిద్రపోతున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని ఆందోళన పడ్డారు. సేలం జిల్లా వాళప్పాడిలో శనివారం

అర్ధ రాత్రి ఆర్తనాదాలు

ప్రైవేటు బస్సును ఢీకొన్న టిప్పర్‌ 

దంపతుల సహా ఆరుగురి దుర్మరణం


చెన్నై/అడయార్‌: బస్సులో ప్రశాంతంగా నిద్రపోతున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని ఆందోళన పడ్డారు.  సేలం జిల్లా వాళప్పాడిలో శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సును టిప్పర్‌ లారీ ఢీకొనడంతో దంపతుల సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు ప్రమాదస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పోలీసుల కథనం మేరకు... సేలం కొత్త బస్టాండు నుంచి శనివారం రాత్రి 11.15 గంటలకు ఒక ప్రైవేటు బస్సు చెన్నై బయలుదేరింది. ఆ బస్సును డ్రైవర్‌ పరమేశ్వరన్‌ (50) నడిపారు. డ్రైవర్‌తోపాటు, క్లీనరు  దీపన్‌ (24)  కేబిన్‌లో ఉన్నాడు. 40 మంది  ప్రయాణికులతో బయల్దేరిన ఆ బస్సు అర్థరాత్రి 12.10 గంటల సమయంలో వాళప్పాడి సమీపంలోని పెద్దనాయక్కన్‌ పాళెయం చేరుకుంది. అక్కడ పట్టణ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న వంతెనపై వెళ్తూ అక్కడ నిలబడిన ప్రయాణికులను ఎక్కించుకునేందుకు బస్సు ఆపారు.


క్లీనర్‌ దీపన్‌ సాయంతో ఆ ప్రయాణికులు తమ లగేజీని బస్సు వెనుక పెడుతుండగా సేలం నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ లారీ వారిపైకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో క్లీనర్‌ దీపన్‌ సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని 108 అంబులెన్స్‌లో వాళప్పాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలియగానే కలెక్టర్‌ కార్మేగం, ఎస్పీ శ్రీ అభినవ్‌, ఆర్డీవో శరణ్య, డీఎఎస్పీ శ్వేతలు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.  


మృతుల గుర్తింపు

ఈ ప్రమాదంలో  పెద్దనాయక్కన్‌ పాళెం, 15వ వార్డుకు చెందిన తిరునావుక్కరసు (61), ఆయన కుమారుడు రవికుమార్‌ (41), వీరి బంధువులు సెంథిల్‌ వేలన్‌ (46), సుబ్రమణి (38), క్లీనర్‌ దీపన్‌ (24) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తిరునావుక్కరసు భార్య విజయ (55), బంధువు మాధేశ్వరి (60), ఆమె కుమారుడు జయప్రకాష్‌ (40)లను ఆస్పత్రికి తరలిస్తుండగా, విజయ మార్గమధ్యంలోనే మరణించింది.  


బస్సు డ్రైవర్‌ తప్పేనా?

ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్‌ తప్పిదమే కారణమని పోలీసులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారిపై అదీ అర్థరాత్రి ప్రయాణికులు ఎక్కించుకునేందుకు నడి రోడ్డుపైనే బస్సు ఆపాడని తెలిపారు. దీంతో బస్సు వెనుక  బాక్సుల్లో లగేజీ పెడుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్‌ వారి పైకి దూసుకుపోయిందని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ లారీ డ్రైవర్‌ కార్తీక్‌ (30)ను ఏత్తాపూర్‌ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-09-19T17:14:05+05:30 IST