UK prime minister race: వెనుకంజలో రుషి సునాక్

ABN , First Publish Date - 2022-08-17T21:52:10+05:30 IST

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న పోటీలో రుషి సునాక్

UK prime minister race: వెనుకంజలో రుషి సునాక్

లండన్ : బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న పోటీలో రుషి సునాక్ (Rishi Sunak) వెనుకంజలో ఉన్నారు. బోరిస్ జాన్సన్ (Boris Johnson) తర్వాత ప్రధాన మంత్రిగా లిజ్ ట్రుస్ (Liz Truss) ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కన్జర్వేటివ్ (Conservative) పార్టీ వెబ్‌సైట్ ConservativeHome నిర్వహించిన సర్వేలో ఆ పార్టీ సభ్యుల్లో అత్యధికులు లిజ్ వైపు నిలిచారు. దీంతో రుషి ఆమె కన్నా 32 పాయింట్లు వెనుకబడి ఉన్నారు. 


కన్జర్వేటివ్ పార్టీ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో ఆ పార్టీకి చెందిన 961 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో 60 శాతం మంది లిజ్ ట్రుస్‌కు అనుకూలంగా ఉన్నారు. కేవలం 28 శాతం మంది మాత్రమే రుషి సునాక్‌కు మద్దతిచ్చారు. ఆగస్టు 4న నిర్వహించిన పోల్‌లో కూడా లిజ్ 32 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. 


కన్జర్వేటివ్ పార్టీకి, ప్రధాన మంత్రి పదవికి తదుపరి నేతగా లిజ్ ట్రుస్‌ను చూడాలని ఆ పార్టీలో అత్యధికులు కోరుకుంటున్నట్లు కన్జర్వేటివ్ హోం వెబ్‌సైట్ బుధవారం తెలిపింది. తాజా పోల్‌లో పాల్గొన్నవారిలో 9 శాతం మంది మాత్రమే ఎటూ తేల్చుకోనట్లు చెప్పారని, దాదాపు 60 శాతం మంది తాము ఇప్పటికే ఓటు వేశామని చెప్పారని వివరించింది. ఓటు వేయవలసినవారు 40 శాతం మంది ఉన్నట్లు వెల్లడైందని తెలిపింది. ఎన్నికల ఫలితాలు సెప్టెంబరు 5న వెలువడతాయి. విజేత ఆ మర్నాడు ప్రధాన మంత్రి పదవిని చేపడతారు.


Updated Date - 2022-08-17T21:52:10+05:30 IST