గంటకు 18 మంది ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-31T09:35:44+05:30 IST

దేశవ్యాప్తంగా 2021లో 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే సగటున ప్రతీ గంటకు 18 మంది (మూడు నిమిషాలకొక్కరు) బలవన్మరణానికి పాల్పడ్డారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తన తాజా..

గంటకు 18 మంది ఆత్మహత్య

2021లో 1.64 లక్షల మంది బలవన్మరణం

ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదికలో వెల్లడి


న్యూఢిల్లీ, ఆగస్టు 30: దేశవ్యాప్తంగా 2021లో 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే సగటున ప్రతీ గంటకు 18 మంది (మూడు నిమిషాలకొక్కరు) బలవన్మరణానికి పాల్పడ్డారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తన తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఆత్మహత్య చేసుకొన్నవారిలో పురుషులు 1,18,979 మంది. స్త్రీలు 45,026 మంది. ట్రాన్స్‌జెండర్లు 28 మంది. బలవన్మరణాలకు పాల్పడినవారిలో రోజువారీ కూలీలే ఎక్కువగా ఉన్నారు. గత ఏడాది 37,751 మంది కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. 2021 మొదటి అర్ధభాగంలో కొవిడ్‌ ఉధృ తంగా వ్యాపించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. కూలీల ఆత్మహత్యలకు ఇది కారణం కావొచ్చని ఎన్‌సీఆర్‌బీ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా, బలవన్మరణాలకు పాల్పడ్డ మహిళల్లో గృహిణిలే ఎక్కువగా ఉన్నారు. వరకట్న వేధింపులు, సంతాన లేమి గృహిణుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. గృహ హింస కేసుల విషయంలో పశ్చిమ బెంగాల్‌ 19,952 కేసులతో తొలి స్థానంలో ఉంది. 18,375 కేసులతో యూపీ తర్వాతి  స్థానంలో ఉంది. దేశంలో రైతుల ఆత్మహత్యలు కూడా ఏటికేడు పెరుగుతున్నాయి. 2021లో 10,881 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 


4 లక్షల రోడ్డు ప్రమాదాలు

2021లో దేశవ్యాప్తంగా 4,03,116 రోడ్డు ప్రమాద ఘటనలు సంభవించాయి. అంటే సగటున రోజుకు 1,100 ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 1,55,622 మంది చనిపోయారు. ఓవర్‌ స్పీడ్‌, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మరోవైపు, యాక్సిడెంట్‌ మరణాల్లో ఎక్కువగా టూవీలర్స్‌ కేసులే ఉన్నాయి. బైక్‌లపై వెళ్తూ ప్రమాదాలకు గురై గత ఏడాది దాదాపు 70వేల మంది మృత్యువాత పడ్డారు.

Read more