అల్లర్లకు పాల్పడిన వారిపై లాఠీ... Return gift అంటూ బీజేపీ ఎమ్మెల్యే వీడియో

ABN , First Publish Date - 2022-06-12T23:31:34+05:30 IST

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు నిరసనగా అల్లర్లు, హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై యూపీ..

అల్లర్లకు పాల్పడిన వారిపై లాఠీ... Return gift అంటూ బీజేపీ ఎమ్మెల్యే వీడియో

లక్నో: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు నిరసనగా అల్లర్లు, హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై యూపీ పోలీసులు కొరడా ఝళిపించారు. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ అల్లర్లలో పాలుపంచుకున్న కొందరు యువకులను పోలీసులు లాఠీలతో చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. బీజేపీ ఎమ్మెల్యే షలభ్ మణి త్రిపాఠి (Shalabh Mani Tripathi) ఈ వీడియోను ''అల్లరిమూకకు రిటర్న్ గిఫ్ట్'' (Return gift to the rioters) అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వివాదమవుతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాజీ మీడియా అడ్వైయిజర్‌గా కూడా త్రిపాఠి వ్యవహరించారు.


కాగా, 30 సెకెండ్ల నిడివి గల ఈ వీడియోలో ఇద్దరు పోలీసులు అల్లర్లకు పాల్పడిన తొమ్మిది మంది యువకులను పోలీస్ లాకప్‌లో చితకబాదుతున్నట్టు కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవడంతో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, ఘటనను ఖండించారు. లాకప్‌లో ఇలాంటి చర్యల వల్ల న్యాయ ఔచిత్యం దెబ్బతింటుందని అన్నారు. కాగా, ఈ ఘటనపై యూపీ పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, షహరాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగినట్టు పలు వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు షహరాన్‌పూర్‌ జిల్లాలో పెద్దఎత్తున అల్లర్లకు దిగారు. ఈ ఘటనలకు సంబంధించి ఇంతవరకూ 300 మందికి పైగా వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

Read more