Reservoirs: నిండుకుండల్లా జలాశయాలు

ABN , First Publish Date - 2022-12-13T08:11:56+05:30 IST

నగరానికి మంచినీటిని అందించే ప్రధాన జలాశయం(Reservoir) చెంబరంబాక్కం నుంచి అదనపు జలాలను విడుదల చేస్తున్నారు.

Reservoirs: నిండుకుండల్లా జలాశయాలు

- చెంబరంబాక్కం నుంచి నీటి విడుదల

- లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక

అడయార్‌(చెన్నై), డిసెంబరు 12: నగరానికి మంచినీటిని అందించే ప్రధాన జలాశయం(Reservoir) చెంబరంబాక్కం నుంచి అదనపు జలాలను విడుదల చేస్తున్నారు. మాండస్‌ తుఫాన్‌ కారణంగా చెన్నై, శివారు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో చెన్నై నగరానికి దాహార్తిని తీర్చే జలాశయాల్లో నీటిమట్టాలు అనూహ్యంగా పెరిగాయి. ఇప్పటికే పూండి రిజార్వయర్‌లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో ఈ జలాశయం నుంచి 10 వేల ఘనపుటడుగుల నీటిని కిందికి విడుదల చేశారు. అదేవిధంగా చెంబరంబాక్కం చెరువు నీటి మట్టం కూడా 23 అడుగులకు చేరుకుంది. ఈ చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం 24 అడుగులు. అయితే, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా చెరువుకు అధిక మొత్తంలో నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఈ నెల 9 నుంచి రోజుకు వంద ఘనపుటడుగుల నీటిని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి నుంచి చెన్నై(Chennai), దాని పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమవారం లెక్కల ప్రకారం చెంబరంబాక్కం చెరువుకు 2,046 ఘనపుటడుగుల నీరు వస్తోంది. దీంతో చెరువు నీటి మట్టం ఒక్కసారిగా పెరింది. ప్రస్తుతం చెరువు నీటి మట్టం 22.43 అడుగులుంది. ఈ చెరువులోకి వచ్చే నీరు అధికంగా ఉండటంతో పది వేల ఘనపుటడుగుల జలాలలను కిందికి విడుదల చేశారు. ఈ చెరువు నుంచి అదనంగా నీరు విడుదల చేసే అవకాశం ఉండటంతో అడయారు నదికి ఇరువైపుల ఉన్న ప్రాంతాల వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా చిరుకళత్తూరు, వళుతిలంబేడు, తిరునీర్‌మలై, అనకాపుత్తూరు సహా అడయారు నది ఒడ్డున ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. పైగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా చెన్నై నగరానికి తాగునీరు సరఫరా చేసే జలాశయాల్లోని నీటిమట్టం వివరాలను అధికారులు ప్రకటించారు. ఆ మేరకు పూండి రిజర్వాయర్‌లో 2,839 మిలియన్‌ ఘనపుటడుగుల నీరు నిల్వ ఉంది. అలాగే, చోళవరంలో 687, చెంబరంబాక్కంలో 3,814, కన్నన్‌కోట్టైలో 500, పుళల్‌లో 2,615 మిలియన్‌ ఘనపుటడుగుల చొప్పున నీరు నిల్వ ఉంది. ఈ జలాశయాలన్నింటిలో కలుపుకుని మొత్తం 9,825 మిలియన్‌ ఘనపుటడుగుల నీరు నిల్వ ఉంది.

Updated Date - 2022-12-13T08:11:58+05:30 IST