రాజాచారి.. గగన విహారి

ABN , First Publish Date - 2022-03-16T07:54:30+05:30 IST

భారతీయ మూలాలు ఉన్న అమెరికా వ్యోమగామి రాజాచారి అత్యంత అరుదైన ఘనత సాధించారు. స్పేస్‌వాక్‌ చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు..

రాజాచారి.. గగన విహారి

స్పేస్‌ వాక్‌ చేసిన తొలి 

భారతీయ సంతతి వ్యక్తిగా రికార్డు

రాజాచారికి తాతలు మహబూబ్‌నగర్‌ వాసులు

గత ఏడాది నవంబరులో ఐఎస్‌ఎస్‌కు పయనం

చంద్రయానానికి నాసా ఎంపిక చేసిన 

ఆర్టెమిస్‌ టీమ్‌లోనూ చోటు


న్యూఢిల్లీ, మార్చి 15: భారతీయ మూలాలు ఉన్న అమెరికా వ్యోమగామి రాజాచారి అత్యంత అరుదైన ఘనత సాధించారు. స్పేస్‌వాక్‌ చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రాజాచారికి తెలంగాణ మూలాలుండటం మరింత విశేషం. అంతరిక్షంలో పరిశోధనల కోసం ఆకాశంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎస్‌) నుంచి బయటకొచ్చిన ఆయన రోదసిలో సంచరించారు. ఆరున్నర గంటలకు పైగా అంతరిక్షంలో స్పేస్‌వాక్‌ చేసిన రాజాచారి ఐఎ్‌సఎ్‌సకు సంబంధించిన ఓ కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫ్లైట్‌ ఇంజనీర్‌ కైలా బారన్‌తో కలిసి రాజాచారి స్పేస్‌వాక్‌ మొదలుపెట్టారు. ఐఎ్‌సఎస్‌ నుంచి బయటకొచ్చి స్పేస్‌ స్టేషన్‌ స్టార్‌ బోర్డు-4 ట్రస్‌ వద్దకు చేరుకుని ఇప్పటికే ఉన్న సోలార్‌ ప్యానళ్ల స్థానంలో కొత్త ప్యానళ్లను అమర్చారు. ఇద్దరూ కలిసి మొత్తం ఆరు ‘ఐఎ్‌సఎస్‌ రోల్‌ ఔట్‌ సోలార్‌ ఆరే(ఐఆర్‌ఓఎ్‌సఏ)’లను మార్చారు.


థామస్‌ మార్ష్‌బర్న్‌, మథీయాస్‌ మౌరర్‌ అనే మరో ఇద్దరు వ్యోమగాములు ఐఎ్‌సఎస్‌ లోపల నుంచి వీరిద్దరిని నిరంతరం పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేశారు. రాజాచారి బృందం అమర్చిన కొత్త సోలార్‌ ప్యానళ్ల్లు సూర్యకాంతిని సంగ్రహించి స్పేస్‌ స్టేషన్‌లో రోజువారీ పరిశోధనలకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అందిస్తాయి. స్పేస్‌ స్టేషన్‌లో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు నాసా ఈ ప్రయోగం చేసింది. ఐఎ్‌సఎ్‌సకు ప్రస్తుతం 160 కిలో వాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉండగా కొత్త ప్యానళ్ల అమరిక తర్వాత ఇది 215 కిలోవాట్లకు పెరగనుంది. రాజాచారికి ఇది తొలి స్పేస్‌ వాక్‌ కాగా బారన్‌కు రెండోది. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ క్రూ-3 మిషన్‌కు 2020లో కమాండర్‌గా ఎంపికైన రాజాచారి గత ఏడాది నవంబర్‌లో ఐఎ్‌సఎ్‌సకు వెళ్లారు. మంగళవారం నిర్వహించిన స్పేస్‌వాక్‌ కోసం వారం రోజులుగా అక్కడే సిద్ధమమయ్యారు. అన్నిరకాల పరీక్షలు, భూమి మీద ఉన్న నిపుణులతో చర్చల అనంతరం నాసా స్పేస్‌వాక్‌కు అనుమతినిచ్చింది. మార్చి 23న నాసా మరోసారి స్పేస్‌ వాక్‌ నిర్వహించనుంది.


రాజాచారి నేపథ్యం..

రాజాచారి తాతముత్తాతలు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారు. ఆయన తాతగారి హయాంలో వారి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. రాజాచారి తాత ఉస్మానియా యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాసాచారి ఉస్మానియాలో ఇంజనీరింగ్‌ చదివి ఉన్నత చదువుల నిమిత్తం 1970ల్లో అమెరికా వెళ్లారు. పెగ్గీ ఎగ్బర్ట్‌ అనే మహిళను 1976లో పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. 1977 జూన్‌ 25న రాజాచారి వారికి జన్మించారు. శ్రీనివాసాచారి ఇమ్యూన్‌వ్యాధితో 2010లో తన 67వ ఏట మరణించారు. ఇక.. రాజాచారి అయోవా రాష్ట్రంలోని సెడర్‌ ఫాల్స్‌లో పెరిగారు. 1995లో పట్టభద్రుడైన రాజాచారి.. కొలరాడోలోని ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ’లో ‘బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఆస్ట్రొనాటికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌’ పూర్తిచేశారు. అనంతరం కేంబ్రిడ్జిలోని మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 2001లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.


అనంతరం ఒక్లహోమాలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ పైలట్‌ ట్రైనింగ్‌ పూర్తి చేశారు.  అనంతరం పలు సంస్థల్లో శిక్షణ పొంది.. అమెరికా వాయుసేనలో చేరారు. ఆయనకు ఎఫ్‌-35, ఎఫ్‌-15, ఎఫ్‌-16, ఎఫ్‌-18 విమానాలు నడిపిన అనుభవం ఉంది. అనంతర కాలంలో రోదసియానంపై ఆసక్తి పెంచుకున్న రాజాచారి 2017లో ‘నాసా ఆస్ట్రొనాట్‌ గ్రూప్‌ 22’ మిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దానికి మొత్తం 18,300 దరఖాస్తులు రాగా కేవలం 12 మందిని నాసా ఎంపిక చేసింది. వారిలో రాజాచారి ఒకరు. 2017 ఆగస్టు నుంచి నాసా ఆ పన్నెండు మందికీ రోదసియానంలో రెండేళ్లపాటు శిక్షణనిచ్చింది. శిక్షణ ముగిశాక ఆయన ‘నాసా కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌’లో జాయింట్‌ టెస్ట్‌ టీమ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. తర్వాత.. ఐఎ్‌సఎ్‌సకు వెళ్లే ‘నాసా స్పేస్‌ ఎక్స్‌ క్రూ3 మిషన్‌’ కమాండర్‌గా ఎంపికయ్యారు. కాగా.. గత ఏడాది డిసెంబరులో నాసా రాజాచారిని ‘ఆర్టెమిస్‌’ బృందంలోకి ఎంపిక చేసింది. ఎప్పుడో అపోలోతో ఆపేసిన చంద్రయానాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు నాసా చేపట్టిన మిషనే ఈ ఆర్టెమిస్‌. 18 మంది (9 మంది పురుషులు, 9 మంది మహిళలు) ఉన్న ఈ బృందంలో నుంచి ఇద్దరు  2024లో చంద్రుడిపై అడుగుపెట్టనున్నారు. ఆర్టెమిస్‌ టీమ్‌లోని ఒకరికి కుజుడిపైకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ రెండు మిషన్లలో రాజాచారి దేనికి ఎంపికైనా అది చరిత్రే. 

Read more