Inflation protest: రాహుల్, ప్రియాంకా గాంధీ అరెస్టు

ABN , First Publish Date - 2022-08-05T19:38:51+05:30 IST

ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ...

Inflation protest: రాహుల్, ప్రియాంకా గాంధీ అరెస్టు

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, శశిథరూర్, కేసీ వేణుగోపాల్ తదితరులను ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వెలుపల పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ అరెస్టులపై రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టాలని అనుకుంటే అందుకు తమను అనుమతించలేదని చెప్పారు. ప్రజాసమస్యలను లేవనెత్తడమే తమ బాధ్యతని, కొందరు ఎంపీలను నిర్బంధించడమే కాకుండా కొట్టారని ఆయన ఆరోపించారు.


దీనికి ముందు, కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంటులో హౌస్ వెలుపల నల్లదుస్తులు ధరించి తమ నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ నల్ల చొక్కా వేసుకున్నారు. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ నిర్వహించాలనుకున్న ప్రొటెస్ట్ మార్చ్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వం వహించారు. ఆమె సైతం నలుపు దుస్తులు ధరించారు. ధరల పెరుగుదల, అగ్నిపథ్‌పై తాము నిరసన చేస్తున్నామని, రాజకీయ పార్టీగా, ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యలు, భయాలపై గళం విప్పడం తమ బాధ్యతని, అదే తాము చేస్తున్నామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు.


ధరలు చుక్కలనంటుతున్నాయని, ఈ పెరుగుదలకు ఒక హద్దు అంటూ లేకుండా పోయందని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. అందుకోసమే తాము పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యవసర వస్తువులపై జీఎస్‌టీ బాదుడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనల్లో భాగంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకూ మార్చ్ నిర్వహించడంతో పాటు ప్రధాని నివాసాన్ని దిగ్బంధించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది.

Updated Date - 2022-08-05T19:38:51+05:30 IST