Padayatra: రాష్ట్రంలో ముగిసిన రాహుల్ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-09-11T14:38:36+05:30 IST

కన్నియాకుమారిలో ఈ నెల 7వ తేదీన తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీస్‏ఘడ్‌ల ముఖ్యమంత్రులు జాతీయపతాకాన్ని అందించగా, ప్రారంభమైన రాహుల్‌

Padayatra: రాష్ట్రంలో ముగిసిన రాహుల్ పాదయాత్ర

- 4వ రోజు పాదయాత్రకు భారీ జనసందోహం

- యువనేతను కలిసేందుకు ఎగబడిన యువత, మహిళలు

- దారి పొడవునా నీరాజనం

- ‘భారత్‌ జోడో’ యాత్రతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌


చెన్నై, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కన్నియాకుమారిలో ఈ నెల 7వ తేదీన తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీస్‏ఘడ్‌ల ముఖ్యమంత్రులు జాతీయపతాకాన్ని అందించగా, ప్రారంభమైన రాహుల్‌ యాత్ర శనివారం ముగిసింది. యాత్ర ప్రారంభంలో ఏ మేరకు కొనసాగుతుందోనన్న శంక ఆదిలో పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది. అయితే అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ రాహుల్‌ పాదయాత్ర(Rahul Padayatra)లో దూసుకుపోవడం, ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ మమేకం కావడం తదితరాలతో పార్టీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. రోజురోజుకు ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం, దేశవ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరగడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. రాష్ట్రంలో కాకుండా, సరిహద్దు జిల్లా అయిన కన్నియాకుమారి వరకు మాత్రమే ఈ యాత్ర సాగినప్పటికీ రాష్ట్రంలో వున్న అన్ని పార్టీలు ఈ వ్యవహారంపై చర్చించుకోవడం కాంగ్రెస్‌ నేతల్లో ఆత్మవిశ్వాసం పెంచింది. మిత్రపక్షమైన డీఎంకే శ్రేణులు వెంట రాకపోయినా, ప్రజలు స్వచ్ఛందంగా రావడం పట్ల కాంగ్రెస్‌ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


బడి పిల్లలతో ప్రారంభం..: శనివారం ఉదయం ములుగుమేడు పాఠశాలలో పాదయాత్ర ప్రారంభించిన రాహుల్‌(Rahul).. అక్కడ చదువుతున్న బడిపిల్లలతో కబుర్లాడారు. వారితో కలిసి ఫోటోలు తీసుకున్నారు. అటుపిమ్మట ఉదయం 7.05 గంటలకు రాహుల్‌ పార్టీ ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేలాదిమంది కార్యకర్తలు వెంట రాగా వారితో కలిసి అడుగులు వేశారు. కాంగ్రెస్‌ సేవాదళ్‌ సభ్యులు, పార్టీ ప్రముఖులు తెలుపురంగు టీషర్ట్స్‌, ప్యాంట్‌ ధరించి, కాంగ్రెస్‌ జెండాలు చేబూని ‘రాహుల్‌ వర్థిల్లాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయసింగ్‌(Former Chief Minister of Madhya Pradesh Digvijay Singh), పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దినేష్‌ గుండూరావు, ఎంపీలు విజయ్‌వసంత్‌, జ్యోతిమణి, శాసనసభ్యుడు రాజేష్‏కుమార్‌, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, ఉపాధ్యక్షుడు రాబర్ట్‌ బ్రూస్‌, పాదయాత్ర సమన్వయకర్త డాక్టర్‌ జయకుమార్‌, సీఎల్పీనేత సెల్వ పెరుందగై, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు,తదితరులు రాహుల్‌తోపాటు వేగంగానడిచారు.


యూత్‌ కాంగ్రెస్ స్వాగతం...

మార్గమధ్యంలో ఇరవిపుదూరు కూడలి వద్ద కన్నియాకుమారి ఈస్ట్‌ జిల్లా యువజన కాంగ్రెస్‌ సభ్యులు 78 మంది వంటికి కాంగ్రెస్‌ జెండా రంగుల పెయింటింగ్‌ వేసుకుని వరుసగా నిలిచి సందడి చేశారు. వారి వంటిపై ‘వెల్‌కమ్‌ టు రాహుల్‌ జీ’ అనే నినాదాలు రాసుకుని రాహుల్‌కు స్వాగతం పలికారు.  ఇక సిరాయన్‌కుళి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు బ్యాండ్‌ మేళాలతో నృత్యం చేస్తూ రాహుల్‌కు స్వాగతమిచ్చారు. పలుచోట్ల రాహుల్‌ ఫోటోలు ముద్రించి ఉన్న పెద్ద పెద్ద బెలూన్ల కార్యకర్తలు ఎగురవేశారు. కొన్ని చోట్ల రాహుల్‌ను దగ్గరగా చూడటానికి మహిళలు ఆయన వైపు దూసుకువచ్చారు. భద్రతా సిబ్బంది అడ్డుకున్నా పట్టించుకోకుండా రాహుల్‌ దగ్గరకు వెళ్ళి ఆయనతో కరచాలనం చేసి పాదయాత్ర విజయం కావాలంటూ తమిళంలో శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికి ధన్యవాదాలు తెలిపి రాహుల్‌ పాదయాత్రను కొనసాగించారు. ఇలా పలుచోట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు, మహిళలు స్వాగతం పలుకటంతో రెట్టింపు ఉత్సాహంతో రాహుల్‌ నవ్వుతూ వేగంగా నడిచారు. రాహుల్‌ వేగాన్ని అందుకోలేక సీనియర్‌ నేతలు కష్టపడ్డారు.


రాహుల్‌జీ సెల్ఫీ ప్లీజ్‌...

ఓ చోట విద్యార్థినులు గుంపుగా నిలిచి సెల్‌ఫోన్‌లు చేతపట్టుకుని ‘రాహుల్‌జీ సెల్ఫీ ప్లీజ్‌’ అంటూ బిగ్గరగా కేకలు పెట్టారు. వారి ఉత్సాహాన్ని చూసిన రాహుల్‌(Rahul) భద్రతా వలయాన్ని దాటుకుని వారి వద్దకు వెళ్ళి నిలిచారు. ఆ సందర్భంగా విద్యార్థినులంతా రాహుల్‌తో సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు. ఉదయం 9.10 గంటలకు రాహుల్‌ మార్తాండమ్‌ నేసమణి కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ కళాశాలలోని అతిథిగృహంలో రాహుల్‌ మధ్యాహ్నం మూడు గంటల దాకా బసచేశారు. ఆ తర్వాత అక్కడి నుండి మళ్ళీ పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్రను కొనసాగించారు. సాయంత్రం ఏడు గంటలకు కలియక్కావినై సమీపంలో ఉన్న కేరళ సరిహద్దు ప్రాంతమైన సెరువారకోణం సామువేల్‌ ఎల్‌ఎంఎస్‌ మహోన్నత పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు. దీనితో రాహుల్‌ తమిళనాట నాలుగు రోజుల పాదయాత్ర ముగిసింది. రాత్రి ఆ పాఠశాల వద్దే రాహుల్‌, 119 మంది పాదయాత్ర బృందం సభ్యులు, పార్టీ ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో బసచేశారు. ఆదివారం ఉదయం రాహుల్‌ గాంధీ కేరళలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. 


అలరించిన సిలంబాట్టమ్‌...

రాహుల్‌ పాదయాత్ర మార్గంలో తమిళ జానపద కళాకారులు సిలంబాట్టమ్‌ (కర్రసాము విన్యాసాలు) నిర్వహించారు. ఆ గ్రామీణ నృత్యం చేస్తూ కళాకారులు రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు. ఆ గ్రామీణ నృత్యాన్ని రాహుల్‌ కాసేపు ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత ఆ కళాకారులు రాహుల్‌తో నిలిచి సెల్ఫీ తీసుకున్నారు. ఇక రాహల్‌ పాదయాత్ర నిర్వహించిన రహదారికి ఇరువైపులా వందల సంఖ్యలో బాలబాలికలు వరుసగా నిలిచి ‘రాహుల్‌ వర్థిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆ బాలబాలికలను రాహుల్‌ కలుసుకుని వారితో సెల్ఫీ తీసుకున్నారు. ఇదే విధంగా రహదారికి ఇరువైపులా పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు బారులు తీరి రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు. రాహుల్‌ పాదయాత్ర చేస్తుండగా రాహదారికి ఇరువైపులా, ఇళ్లపై జనాలు నిలిచి చేతులూపుతూ అభివాదం చేశారు. రాహుల్‌ పాదయాత్ర(Rahul Padayatra) మార్గంలో ప్రతి కూడలి వద్ద కేరళ చండీ మేళం, మంగళవాయిద్యాలతో స్థానికులు స్వాగతం పలికారు. ఇదేవిధంగా గ్రామీణకళాకారులు గరగాట్టం, ఒయిలాట్టమ్‌ వంటి తమిళ సంప్రదాయక నృత్యాలతో రాహుల్‌ను ఉత్సాహపరిచారు. నాలుగోరోజు రాహుల్‌ నిర్వహించిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పలుచోట్ల రాహుల్‌ రాకకోసం యువతీయువకులు వేచి ఉన్నారు. రాహుల్‌ వీరందరిని ఆప్యాయంగా పలకరిస్తూ పాదయాత్రను కొనసాగించారు.



Updated Date - 2022-09-11T14:38:36+05:30 IST