రాహుల్‌ యాత్రలో ‘గోవధ’ నేత

ABN , First Publish Date - 2022-10-01T08:23:55+05:30 IST

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర మరోసారి వివాదాల్లో చిక్కుకుంది.

రాహుల్‌ యాత్రలో ‘గోవధ’ నేత

మళ్లీ వివాదాల్లోకి ‘భారత్‌ జోడో’

కర్ణాటకలోకి ప్రవేశించిన పాదయాత్ర

బెంగళూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. గోవధ నిషేధానికి నిరసనగా పట్టపగలే లేగదూడ తలనరికిన రిజిల్‌ చంద్రన్‌ మాకుట్టి అనే వ్యక్తి యాత్రలో రాహుల్‌తో కనిపించడం కలకలం రేపింది. రాహుల్‌ యాత్రకు హిందూ విద్వేషమే లక్ష్యమనేది మళ్లీ రుజువైందని హిందుత్వ సంస్థలు దుయ్యబడుతున్నాయి. యాత్రలో రాహుల్‌తో అతడు ఉన్న ఫొటోను, దూడ మెడ నరికి తన బృందంతో నినాదాలు చేస్తున్న ఫొటోను..బీజేపీ ఐటీ సెల్‌ శుక్రవారం విడుదల చేసింది. కాగా, కేరళలో 20 రోజుల పాదయాత్ర ముగించుకుని, కర్ణాటక రాష్ట్రంలోకి శుక్రవారం చామరాజనగర్‌ జిల్లా గుండ్లుపేట వద్ద రాహుల్‌గాంధీ పాదయాత్ర ప్రవేశించింది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ నేతృత్వంలో రాహుల్‌గాంధీని సాదరంగా స్వాగతించారు. తొలిరోజున రాహుల్‌ వెంట పాదయాత్రలో లక్షమందికి పైగా పాల్గొన్నారు. గుండ్లుపేటకు రాహుల్‌గాంధీ చేరుకోగానే, కళాబృందాల ద్వారా ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. రాజ్యాంగ రక్షణకు, ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడేందుకే దేశవ్యాప్తంగా ‘భారత్‌ జోడో’ పాదయాత్రను ప్రారంభించినట్టు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కాగా, ఏఐసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్‌ల దాఖలు గురించి రాహుల్‌గాంఽధీ ఆరా తీశారు.

Updated Date - 2022-10-01T08:23:55+05:30 IST