విపక్షాలన్నీ ఒక్కటవ్వాలి

ABN , First Publish Date - 2022-09-10T08:20:37+05:30 IST

దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ పిలుపిచ్చారు.

విపక్షాలన్నీ ఒక్కటవ్వాలి

అది అన్ని పార్టీల బాధ్యత

యాత్ర ప్రజలను కలిసేందుకే!

సమస్యలు తెలుసుకోవడానికే

నేను యాత్ర సారథిని కాను..

అందులో పాల్గొంటున్నానంతే

బీజేపీ, సంఘ్‌లతో విద్వేషం 

ఆ నష్టాన్ని సరిచేసేందుకే 

‘భారత్‌ జోడో’: రాహుల్‌ 

మూడో రోజుకు పాదయాత్ర


చెన్నై, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ పిలుపిచ్చారు. వాటిని కలిపే బాధ్యత ఒక్క కాంగ్రెస్‌దే కాదన్నారు. ప్రతి పార్టీకీ అందులో పాత్ర ఉందని చెప్పారు. శుక్రవారం నాగర్‌కోయిల్‌లోని స్కాట్‌ క్రైస్తవ కళాశాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ‘భారత్‌ జోడో యాత్ర’ మూడో రోజు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. మధ్యాహ్నం యాత్ర విరామం సందర్భంగా పులియూరుకురిచ్చి వద్ద విలేకరులతో మాట్లాడారు. విపక్షాల ఐకమత్యం దిశగా సాగుతున్న చర్చలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అవినీతి ఆరోపణల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి భారత్‌ జోడో యాత్ర తలపెట్టానన్న బీజేపీ ఆరోపణలను ఖండించారు.


ప్రజలతో మమేకం కావడానికే ఈ కార్యక్రమమని చెప్పారు. ‘ప్రజలను కలవడం.. వారు చెప్పేది వినడం.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడం.. కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లడం ఈ యాత్ర ఉద్దేశం. భిన్న దృక్పథాలున్న దేశంపై ఒకే ఆలోచనను రుద్దే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయి. యాత్రకు నేను నేతృత్వం వహించడం లేదు. ఇందులో పాల్గొంటున్నానంతే’ అని పేర్కొన్నారు. ఈ యాత్ర ద్వారా తన గురించి, ఈ దేశం గురించి కూడా కొంత అర్థం చేసుకుంటానని.. ఈ 2-3 నెలల్లో కాస్త తెలివి పెంచుకుంటానని రాహుల్‌ అనగా.. అక్కడున్న వారంతా నవ్వేశారు. ఈ యాత్ర ప్రతిపక్షాల ఐకమత్యానికి కూడా తోడ్పతుందని వ్యాఖ్యానించారు. దేశంలో రెండు సిద్ధాంతాలు ఉన్నాయని.. వెయ్యేళ్లుగా వీటి మధ్య పోరు జరుగుతోందన్నారు. అన్ని వ్యవస్థలనూ బీజేపీ తన చెప్పుచేతుల్లోకి తీసుకుందని.. ప్రతి చోటా తనవారిని చొరబెట్టిందని ఆరోపించారు. దీనిని వ్యతిరేకించేవారిపై ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. కంగనాకడై వద్ద ఓ టీ దుకాణానికి వెళ్లిన రాహుల్‌.. అక్కడ బల్లపై కూర్చొని టీ తాగుతూ స్థానికులతో మాట్లాడారు.


రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పీఆర్‌ పాండ్యన్‌ తదితరులతోనూ ముచ్చటించారు. రైతుల సమస్యలను, అందుకు అవసరమైన పరిష్కారాలనూ అడిగి తెలుసుకున్నారు. దారిలో కొందరు మహిళలు తాటాకు టోపీని బహూకరించారు. ఎండవేడిమి తగలకుండా దానిని ధరించాలని సూచించడంతో రాహుల్‌ సంతోషంగా స్వీకరించి, ధన్యవాదాలు తెలిపారు. దేశానికి ఒక దార్శనికతే లేకుండా పోయిందని, బీజేపీ దానిని ఇవ్వలేకపోయిందని రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘కార్పొరేట్‌ భారతానికి మేం అనుకూలం. కానీ కొందరి భారీ గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నాం. రైతులు, చిన్న పరిశ్రమల పట్ల అన్యాయాన్ని నిరసిస్తున్నాం. అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. 


ప్రజలతో కాంగ్రెస్‌ బంధం తెగింది: బీజేపీ

మోదీ హయాంలో దేశంలో చర్చలే ఆగిపోయాయ ని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ప్రజలతో కాంగ్రెస్‌ బంధం తెగిపోయిందని.. వరుస ఎన్నికల్లో పరాజయాలు, సీనియర్‌ నేతల నిష్క్రమణే దీనికి నిదర్శనమని బీజేపీ ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా స్పష్టం చేశారు. పలు విపక్షాల నేతలు ప్రధాని పదవిపై కన్నేసి ఢిల్లీ వస్తున్నారని.. ఈ నేపథ్యంలో తాను కూడా పోటీలో ఉన్నానని చెప్పుకోవడానికే రాహుల్‌ జోడో యాత్ర తలపెట్టారని ఢిల్లీలో ఎద్దేవాచేశారు. దేశం సమైక్యంగానే ఉందని.. దాని గురించి మరచిపోయి.. మీ పార్టీ నేతలు కాంగ్రె్‌సలోనే కొనసాగేలా కోసం కృషిచేయాలని హితవు పలికారు. 


అధ్యక్ష ఎన్నికపై నిర్ణయం తీసేసుకున్నా

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేదీ లేనిదీ రాహుల్‌ విలేకరులకు స్పష్టత ఇవ్వలేదు. నర్మగర్భంగా స్పందించారు. ‘దీనిపై ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నాను. ఈ విషయంలో నాకెలాంటి అయోమయమూ లేదు. అధ్యక్షుడిని అవుతానో లేదో ఎన్నిక జరిగినప్పుడు స్పష్టత వస్తుంది. అప్పటివరకు వేచి చూడండి’ అని సూచించారు. ఒకవేళ పోటీచేయకుంటే విలేకరులు తనను అడగొచ్చని.. అందుకు జవాబు చెబుతానని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీనియర్‌ నేతలు ఎంత కోరినా వెనక్కి తీసుకోలేదు. దాంతో ఆయన తల్లి సోనియాగాంధీ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఎట్టకేలకు ఇటీవల అధ్యక్ష పదవికి షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ అనివార్యమైతే అక్టోబరు 17న పోలింగ్‌ జరుగుతుంది.


పాకశాల మిత్రులతో కలయిక

గత ఏడాది రాహుల్‌ తమిళనాట పర్యటించినప్పుడు ఆయనకు గ్రామీణ పద్ధతిలో రుచికరమైన వెజిటబుల్‌ బిర్యానీ తయారుచేసి పెట్టిన ‘విలేజ్‌ కుకింగ్‌ ఛానల్‌’ యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకులు శుక్రవారం పాదయాత్రలో ఆయన్ను కలుసుకున్నారు. యాత్రకు సంఘీభావం ప్రకటించారు.

Read more