Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ...

ABN , First Publish Date - 2022-10-02T18:05:27+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం మహాత్మా గాంధీ

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ...

బెంగళూరు : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం మహాత్మా గాంధీ (Mahatma Gandhi)కి నివాళులర్పించారు. మహాత్ముడు అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారని, అదేవిధంగా తాము కూడా దేశాన్ని ఏకం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కర్ణాటకలోని బందనవోలులో ఉన్నారు. 


బందనవోలులోని ఖాదీ గ్రామోద్యోగ్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి రాహుల్ గాంధీ ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ 1927, 1932లలో ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ ఖాదీ గ్రామోద్యోగ్ ఏర్పాటుకు సహకరించారు. 




రాహుల్ గాంధీ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, సత్యం, అహింస మార్గంలో నడవడాన్ని మనకు బాపూజీ నేర్పించారని తెలిపారు. ప్రేమ, కరుణ, సద్భావం, మానవత్వం అర్థాలను వివరించారని చెప్పారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా ఓ ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. బాపూజీ ఏ విధంగా అయితే అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారో, అదేవిధంగా ఇప్పుడు తాము భారత దేశాన్ని ఏకం చేస్తామని చెప్పారు. 




కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గేతో కలిసి రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా గాంధీజీకి నివాళులర్పించారు. బాపూజీ సత్యానికి నిలువెత్తు రూపమని, ధైర్యసాహసాలతో కూడిన దిక్సూచి అని పేర్కొన్నారు. దేశ ప్రజల బాధలను పంచుకునే, యావత్తు భారత దేశాన్ని ఏకం చేసే  భారత యాత్రికుడు గాంధీజీ అని అన్నారు. బాపూ చూపిన మార్గంలో, భారత్ జోడో నినాదంతో, ఐకమత్యమనే దివిటీని చేతబట్టి, దృఢనిశ్చయంతో నేడు నడుస్తున్నామని తెలిపారు. 




గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ట్వీట్‌లో, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించింది. ఆయన దార్శనికత, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆదర్శాలు భారత దేశానికి పునాదులు వేశాయని తెలిపింది. గాంధీ జయంతిని జరుపుకుంటున్న సందర్భంగా శాంతి, అహింసల కోసం అంకితమవుతామని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చింది. మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు కూడా కాంగ్రెస్ నివాళులర్పించింది. 


Updated Date - 2022-10-02T18:05:27+05:30 IST