Bharath Jodo Yatra: నేడు గూడలూరుకు రాహుల్

ABN , First Publish Date - 2022-09-29T13:24:50+05:30 IST

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ‘భారత్‌ జోడో’ యాత్ర పేరిట కేరళలో పాదయాత్ర ముగించుకుని గురువారం మధ్యాహ్నం

Bharath Jodo Yatra: నేడు గూడలూరుకు రాహుల్

                                        - భారీ భద్రతా ఏర్పాట్లు


చెన్నై, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ‘భారత్‌ జోడో’ యాత్ర పేరిట కేరళలో పాదయాత్ర ముగించుకుని గురువారం మధ్యాహ్నం నీలగిరి జిల్లా గూడలూరు రానున్నారు. ఆ సందర్భంగా గూడలూరులో సాయంత్రం వరకూ ఆయన పాదయాత్ర నిర్వహించి మరుసటి రోజు కర్ణాటకకు బయలుదేరి వెళ్ళనున్నారు. రాహుల్‌ పాదయాత్రను పురస్కరించుకుని గూడలూరు(Gudalur) ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నెల 7వ తేదీ రాహుల్‌గాంధీ కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజులపాటు కన్నియాకుమారిలో పాదయాత్ర చేసి కేరళ వెళ్ళారు. కేరళలో 18 రోజుల పాదయాత్ర ముగించుకుని మల్లాపురం జిల్లా నీలంబూరు మీదుగా గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నీలగిరి జిల్లా గూడలూరుకు చేరుకుంటారు. ఆ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ తరఫున పార్టీ నాయకులు, ప్రముఖులు, వేలాదిమంది కార్యకర్తలు రాహుల్‌కు ఘనస్వాగతం పలుకనున్నారు. అనంతరం ఆమైకుళం ప్రాంతంలో ఆయన మళ్ళీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. కోళిపాలం, పల్లిపాడి, నందట్టి, సెంబాలా మీదుగా గూడలూరు నగరానికి చేరుకుంటారు. రాహుల్‌తోపాటు కోయంబత్తూరు, నీలగిరి(Coimbatore, Nilgiris) జిల్లాలకు చెందిన కాంగ్రె్‌సనాయకులు, ప్రముఖులు కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటారు. చివరగా గూడలూరు కొత్త బస్‌స్టేషన్‌ సమీపంలో గురువారం సాయంత్రం జరిగే బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించనున్నారు. రాత్రి అక్కడికి సమీపంలోని ప్రైవేటు పాఠశాల మైదానంలో కారావాన్‌లో బసచేయనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన గూడలూరు నుండి కర్ణాటకకు బయలుదేరి వెళతారు. రాహుల్‌ పాదయాత్ర నిర్వహించనున్న రహదారులకు ఇరువైపులా ఉన్న భవనాల వద్ద సాయుధ పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. బహిరంగ సభ జరిగే మైదానంలో సుమారు రెండు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. అంతే కాకుండా గూడలూరులోని లాడ్జీలు, మేన్షన్లలో, ప్రైవేటు అతిథిగృహాలలో బుధవారం సాయంత్రం నుంచి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ పాదయాత్ర చేసే మార్గం, ఆయన పాల్గొనున్న బహిరంగ సభ ప్రాంతం, రాత్రి బసచేయనున్న ప్రైవేటు పాఠశాల మైదానం వద్ద  భద్రతా ఏర్పాట్లను నీలగిరి డీఎస్పీ ఆశిష్‌ రావత్‌, ఆర్డీవో శరవణకన్నన్‌ తదితర అధికారులు పరిశీలించారు.

Read more