Padayatra: 7న కుమరిలో రాహుల్‌గాంధీ పాదయాత్రకు శ్రీకారం

ABN , First Publish Date - 2022-08-30T13:56:40+05:30 IST

‘జోడో భారత్‌’ పేరిట ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) సెప్టెంబరు 7వ తేదీన కన్నియాకుమారిలో చేపట్టనున్న

Padayatra: 7న కుమరిలో రాహుల్‌గాంధీ పాదయాత్రకు శ్రీకారం

- ప్రారంభించనున్న స్టాలిన్‌

- హాజరు కానున్న కాంగ్రెస్‌ మిత్రపక్షాల నేతలు


చెన్నై, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ‘జోడో భారత్‌’ పేరిట ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) సెప్టెంబరు 7వ తేదీన కన్నియాకుమారిలో చేపట్టనున్న పాదయాత్రకు టీఎన్‌సీసీ వర్గాలు ముమ్మరంగా సన్నాహాలు చేపట్టాయి. కన్నియాకుమారి(Kanniyakumari) నుంచి కశ్మీర్‌ వరకు కొనసాగనున్న ఆ పాదయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) హాజరు కానున్నారు. అదే విధంగా ఇతర మిత్రపక్షాల నేతలను కూడా ఆహ్వానించినట్లు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‏కు పూర్వవైభవం కల్పించడమే లక్ష్యంగా రాహుల్‌ చేపట్టనున్న ఈ పాదయాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సుమారు 3750 కి.మీ.ల మేర కొనసాగనుంది. సెప్టెంబర్‌ ఏడున కన్నియాకుమారి సముద్రతీరంలోని గాంధీ మండపం నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. అంతకు ముందు కుమరిలో కాంగ్రెస్‌(Congress) ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో పాల్గొనాల్సిందిగా మిత్రపక్షాల నాయకులకు కాంగ్రెస్‌ అధిష్టానం ఆహ్వానాలు పంపింది. ఆ మేరకు రాహుల్‌ పాదయాత్ర బహిరంగ సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అంగీకరించారు. ఈ విషయాన్ని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి అధికారికంగా ప్రకటించారు. రాహుల్‌ పాదయాత్రకు కాంగ్రెస్‌ నేతలు పటిష్ఠమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. కన్నియాకుమారి జిల్లాలో రాహుల్‌ పాదయాత్రలో డీఎంకే మిత్రపక్షాలైన ఎండీఎంకే, డీపీఐ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నాయకులు పాల్గొంటారు. ముందు రాహుల్‌గాంధీ కన్నియాకుమారి నుంచి అగస్తీశ్వరం వివేకానంద కళాశాల వరకూ పాదయాత్ర చేస్తారు. ఆ సమయంలో రాహుల్‌తోపాటు స్టాలిన్‌ కూడా పాదయాత్రలో పాల్గొటారు. ఆ రోజు రాత్రి రాహుల్‌గాంధీ అగస్తీశ్వరం వివేకానంద కళాశాలలోనే బసచేయనున్నారు. మరుసటి రోజు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి కొట్టారం, సుశీంద్రం, మీదుగా నాగర్‌కోయిల్‌లోని స్కార్ట్‌ క్రైస్తవ కళాశాల చేరుకుంటారు. అక్కడ రాత్రి బసచేస్తారు. సెప్టెంబర్‌ తొమ్మిది ఉదయం అక్కడి నుంచి బయలుదేరి ముగుమూడు వరకు పాదయాత్రగా వెళ్ళి అక్కడే రాత్రి బసచేస్తారు. సెప్టెంబర్‌ 10 ఉదయం అక్కడికి నుండి బయలుదేరి రాత్రి సెరువారకోణం చేరుకుంటారు. సెప్టెంబర్‌ 11 ఉదయం కేరళ రాష్ట్రంలోకి అడుగు పెడతారు. కన్నియాకుమారి జిల్లాలో రాహుల్‌ నాలుగు రోజులపాటు పాదయాత్ర చేసి కేరళ వెళ్ళి అక్కడి నుంచి తన యాత్ర కొనసాగిస్తారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి(Alagiri is the president of TNCC) వివరించారు. రాహుల్‌ పాదయాత్ర రూట్‌ ఖరారు కావటంతో ఆయా మార్గాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తగు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - 2022-08-30T13:56:40+05:30 IST