Bharat Jodo Yatra: అమ్మ రాకతో.. ఆనందం

ABN , First Publish Date - 2022-10-07T16:52:58+05:30 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) చేపట్టిన సుధీర్ఘ పాదయాత్ర విజయదశమి పండుగ విశ్రాంతి తర్వాత మళ్ళీ రోడ్డెక్కింది.

Bharat Jodo Yatra: అమ్మ రాకతో.. ఆనందం

- రాహుల్‌ పాదయాత్రలో సోనియాగాంధీ 

- విరామం తర్వాత మండ్య జిల్లా నుంచి..

- భారీగా కదలివచ్చిన అభిమానులు 

- అధినేత్రి రాకతో కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం 

- పార్టీలో విభేదాలు లేవు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‏సింగ్‌ సుర్జేవాలా


బెంగళూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) చేపట్టిన సుధీర్ఘ పాదయాత్ర విజయదశమి పండుగ విశ్రాంతి తర్వాత మళ్ళీ రోడ్డెక్కింది. గురువారం మండ్యజిల్లా పాండవపుర నుంచి గురువారం పాదయాత్ర ఆరంభమైంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరికొన్ని నెలలోనే రానున్న తరుణంలోనే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాదయాత్రలో పాల్గొనడం రాష్ట్రపార్టీ నేతలకు ఎనలేని శక్తిని ఇచ్చినట్లు అయ్యింది. కన్యాకుమారి(Kanyakumari) నుంచి కశ్మీరుదాకా సాగే భారత్‌ జోడో పాదయాత్రకు సిద్దమైన రాహుల్‌గాంధీ తమిళనాడు, కేరళ రాష్ట్రాలను ముగించుకుని కర్ణాటకలో ప్ర వేశించిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా నిరంతరంగా యాత్ర సాగింది. విజయదశమి పండుగ సందర్భంగా పాదయాత్రకు రెండురోజుల విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నమే రాష్ట్రానికి చేరుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కబిని ప్రాంతంలోని ఆరెంజ్‌ కౌంటీ రిసార్టుకు చేరుకున్నారు. రాహుల్‌గాంధీతో మూడురోజుల పాటు రిసార్టులోనే ఉన్నారు. విరామం తర్వాత పాదయాత్ర పాండవపుర తాలూకా బెళ్ళాలె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఆరంభం కాగా సోనియాగాంధీ పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలు ఒకేసారి పాదయాత్ర చేయడం ద్వారా పార్టీ వర్గాలలో ఎనలేని సంతోషం నెలకొన్నట్లు అయ్యింది. సోనియాగాంధీని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్‌ అభిమానులతో పాటు మండ్య, మైసూరు, చామరాజనగర్‌ జిల్లాలకు చెంది న ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సోనియాగాంధీను మహిళా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడేందుకు ప్రయత్నించారు. కాసేపు రాహుల్‌తో కలిసి నడిచిన సోనియాగాంధీ షూ లేస్‌లు ఊడిపోయాయి. గమనించిన రాహుల్‌గాంధీ(Rahul Gandhi) తల్లి పాదాల చెంతన కూర్చొని లేస్‌లు కట్టారు. అరగంటపాటు నడిచిన సో నియాగాంధీ వెనుదిరగగా రాహుల్‌గాంధీ మాత్రం ముందుకే కదిలారు. అక్కడి నుంచి మండ్య జిల్లాలోని ప్రతిష్టాత్మక మేలుకోటె చెలువరాయస్వామి ఆలయాన్ని సోనియాగాంధీ సందర్శించారు. అర్చకులు సాదరంగా స్వాగతించగా ప్రత్యేక పూ జలు జరిపించారు. అనంతరం రిసార్టుకు చేరుకుని మధ్యాహ్నం తర్వాత సోనియాగాంధీ వెనుతిరిగారు. రాహుల్‌, సోనియాగాంధీలతో పాటు రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సహా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రణదీప్ సింగ్‌ సూర్జేవాల సహా పలువురు ముఖ్యనాయకులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం నాగమంగళ కరడ్య వద్ద మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌ పాదయాత్రలో పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T16:52:58+05:30 IST