Rahul Padayatra: జనంతో మమేకమై...

ABN , First Publish Date - 2022-09-10T13:54:22+05:30 IST

రాష్ట్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Former President of AICC Rahul Gandhi) చేపట్టిన ‘భారత్‌ జోడో’ యాత్రకు

Rahul Padayatra: జనంతో మమేకమై...

                        - మూడో రోజు ముగిసిన ‘భారత్‌ జోడో’ యాత్ర


చెన్నై, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Former President of AICC Rahul Gandhi) చేపట్టిన ‘భారత్‌ జోడో’ యాత్రకు మూడవరోజైన శుక్రవారం అపూర్వ ఆదరణ లభించింది. ఆయన పాదయాత్రకు స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చిన ప్రజలు దారి పొడవునా, రోడ్డుకిరువైపులా నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం రెండో రోజు పాదయాత్రను నాగర్‌కోయిల్‌లోని స్కాట్‌ క్రిస్టియన్‌ కళాశాల లో ముగించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఏడుగంటలకు ఆ కళాశాల మైదానంలో రాహుల్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రముఖ సరిహద్దు ఉద్యమనేత కొడిక్కల్‌ షేక్‌ అబ్దుల్లా ఈ కార్యక్రమంలో పాల్గొని రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌తోపాటు ఎంపీలు విజయ్‌వసంత్‌, జ్యోతిమణి, శాసనసభ్యుడు రాజేష్‏కుమార్‌(Rajesh Kumar) సహా వేలాదిమంది పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రహదారికి ఇరువైపులా స్థానిక ప్రజలు బారులు తీరి రాహుల్‌ వర్థిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. పార్వతీపురం, కంగనాకడై మీదుగా సుమారు 12 కి.మీ.  వరకూ ఉల్లాసంగా  ప్రజలవైపు చేతులూపుకుంటూ, అక్కడక్కడా వృద్ధులకు నమస్కరిస్తూ నవ్వుతూ చలాకీగా నడుచుకుంటూ వెళ్లారు. సుమారు రెండున్నరగంటలపాటు ఆయన పాదయాత్ర కొనసాగించారు. మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్‌ పులియూరు కురిచి ప్రాంతంలో పాదయాత్రను ముగించారు. అక్కడే సాయంత్రం వరకూ విశ్రాంతి తీసుకున్నారు. తరవాఆత పులియూరు కురిచ్చి నుంచి పాదయాత్ర ప్రారంభించి శుక్రవారం రాత్రి ఆయన ములుగుమూట్టు ప్రాంతానికి చేరుకుని, అక్కడే బసచేశారు.


టీషాపులో సందడి...

రాహుల్‌ తన పాదయాత్రలో కంగనాకడై రహదారి పక్కనే ఉన్న ఓ టీషాపుకు వెళ్ళి అక్కడున్న స్థానికులతో ముచ్చటించారు. అక్కడి బల్లపై కూర్చుని టీ తాగారు. ఆ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పీఆర్‌ పాండ్యన్‌(PR Pandian), ఆ సంఘం ప్రతినిధులు రాహుల్‌తో సమావేశమయ్యారు. తమిళ రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌ లేత సిమెంట్‌ రంగు ఫ్యాంట్‌ తెలుపురంగు టీషర్ట్‌ ధరించి వేగంగా నడిచారు. తన కోసం రోడ్డు పక్కనే నిలిచిన మహిళలను చూసి ఆయన ఆనందంగా చేతులూపారు. మార్గమధ్యంలో మరుగుజ్జులా ఉన్న పార్టీ కార్యకర్త చేయి పట్టుకుని కబుర్లాడుతూ నడిచారు. దీంతో ఆ కార్యకర్త సంతోషానికి పట్టపగ్గాలు లేకపోయింది.


పాకశాల మిత్రులతో భేటీ....

గత యేడాది రాహుల్‌ పుదుకోటలో పర్యటించినప్పుడు ఆయనకు గ్రామీణ పద్ధతిలో రుచికరమైన వెజిటబుల్‌ బిర్యానీ తయారు చేసిన గ్రామీణ పాకశాల మిత్రులు శుక్రవారం ఉదయం ఆయనను కలుసుకున్నారు. పార్వతీపురం వద్ద ఆ గ్రామీణ పాకశాల నిపుణులతో రాహుల్‌ కబుర్లాడారు. విజిటబుల్‌ బిర్యానీ తయారీలో తాను కూడా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.


వృద్ధుడితో సంభాషణ...

రాహుల్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తున్న సమయంలో ఓ వృద్ధుడు ఆయనను దగ్గరగా చూడటానికి ప్రయత్నించారు. రాహుల్‌ సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో భద్రతాధికారులు ఆ వృద్ధుడిని వెళ్లిపొమ్మని ఆదేశించారు. అది చూసిన రాహుల్‌ వృద్ధుడిని అడ్డుకోవద్దని భద్రతా విభాగం సిబ్బందికి సూచిస్తూ, ఆయన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలుకరించారు.


తాటాకుల టోపీ కానుక...

కంగనాకడై రహదారిలో వెళుతున్న రాహుల్‌ను స్థానిక మహిళలు చుట్టుముట్టి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంగా మహిళలు ఆయనకు తాటాకులతో అందంగా తయారు చేసిన టోపీని కానుకగా ఇచ్చారు. ఎండవేడి తెలియకుండా దానిని ధరించాలని సూచించారు. అదేవిధంగా తమ అభిమాన నేత కోసం బుట్టలతో తెచ్చిన పూలను బహూకరించారు. ఇదిలా వుండగా విల్లుకురి ప్రాంతం వద్ద స్థానికులు ఆయన నడిచే మార్గంలో పూలు పరిచారు. అంతటితో ఆగకుండా ఆయనపై పూల వర్షం కురిపించారు. 



Updated Date - 2022-09-10T13:54:22+05:30 IST