Freedom struggle : సావర్కర్‌ బ్రిటిషర్ల నుంచి స్టైపెండ్ పొందారు : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-10-09T01:16:34+05:30 IST

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak

Freedom struggle : సావర్కర్‌ బ్రిటిషర్ల నుంచి స్టైపెండ్ పొందారు : రాహుల్ గాంధీ

బెంగళూరు : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఆ సంస్థ బ్రిటిష్‌వారికి సహాయపడిందని, దామోదర్ సావర్కర్ బ్రిటిషర్ల నుంచి స్టైపెండ్ తీసుకునేవారని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా కర్ణాటకలోని తుమకూరులో శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 


స్వాతంత్ర్యోద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏమిటని ఓ విలేకరి అడిగినపుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఆ కాలంలో బీజేపీ లేదని, స్వాతంత్ర్యోద్యమంలో ఆ పార్టీ పాత్ర ఏమీ లేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఆరెస్సెస్ బ్రిటిష్‌వారికి సహాయపడిందని, దామోదర్ సావర్కర్ బ్రిటిష్‌వారి నుంచి స్టైపెండ్ పొందేవారని చెప్పారు. స్వాతంత్ర్యోద్యమంలో బీజేపీ ఎక్కడా లేదన్నారు. ఆ వాస్తవాలను ఆ పార్టీ దాచిపెట్టడం సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ నేతలు స్వాతంత్ర్యం కోసం పోరాడారని తెలిపారు. 


దేశంలో విద్వేషం, హింసలను బీజేపీ రెచ్చగొడుతోందన్నారు. హింసాద్వేషాలను రెచ్చగొట్టడం జాతి వ్యతిరేక చర్యలని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై పోరాడతానని శపథం చేశారు. తమది ఫాసిస్ట్ ఆర్గనైజేషన్ కాదన్నారు. చర్చను గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. వ్యతిరేక అభిప్రాయాలను స్వాగతిస్తుందన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే ఓ జట్టుగా పని చేయాలని తమకు తెలుసునని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం భారత దేశం అంటే రాష్ట్రాల యూనియన్ అని చెప్పారు. అన్ని భాషలు, రాష్ట్రాలు, సంప్రదాయాలకు మన దేశంలో సమాన స్థానం ఉందని దీని అర్థం అని చెప్పారు. ఇది మన దేశ స్వభావమని చెప్పారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుందన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. 


పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంపై మాట్లాడుతూ, విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్న వ్యక్తి ఎవరు? ఏ మతానికి చెందినవారు? అనే అంశాలు ముఖ్యమైనవి కాదన్నారు. హింసను, విద్వేషాన్ని వ్యాపింపజేయడం దేశ వ్యతిరేక చర్యలని తన అభిప్రాయమని చెప్పారు. అలాంటివారికి వ్యతిరేకంగా తాము పోరాడతామని తెలిపారు. 


Updated Date - 2022-10-09T01:16:34+05:30 IST