బాలిక పాదరక్షలు సరిచేసిన రాహుల్‌

ABN , First Publish Date - 2022-09-19T07:06:29+05:30 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్ర కేరళలో ఉత్సాహంగా సాగుతోంది.

బాలిక పాదరక్షలు సరిచేసిన రాహుల్‌

జోడో యాత్రలో చిత్రమైన సన్నివేశం

తిరువనంతపురం, సెప్టెంబరు 18: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్ర కేరళలో ఉత్సాహంగా సాగుతోంది. ఆదివారం 11వ రోజుకు చేరిన ఈ యాత్ర కేరళలోని అళప్పుజ జిల్లా అంబాళప్పుజ నగరం నుంచి ఉదయం 6.30 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక నేతలు వందల సంఖ్యలో తరలి వచ్చి రాహుల్‌కు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే.. ఆదివారం నాటి యాత్రలో చిత్రమైన సన్నివేశం చోటు చేసుకుంది. అంబాళప్పుజ నగరంలోని హరిపాద్‌ ప్రాంతంలో ఓ చిన్నారి కూడా యాత్రలో అడుగులు వేసింది. ఇంతలో ఆ చిన్నారి ధరించిన పాదరక్షల బెల్ట్‌ ఊడిపోయింది. అది గమనించిన రాహుల్‌.. ఎలాంటి భేషజాలకు పోకుండా బాలిక పాదరక్షల బెల్ట్‌ను సరిచేశారు. ఇంతలో కొందరు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించి.. సోషల్‌ మీడియాల్లో పోస్ట్‌ చేశారు. పాదయాత్రలో తనను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలను రాహుల్‌ పలకరించారు. కొన్ని సందర్భాల్లో భద్రతను సైతం పక్కన పెట్టి బారికేడ్లకు ఆవల ఉన్న మహిళలను, యువకులను వారి సమీపంలోకి వెళ్లిమరీ పలకరించారు. ఒక గంటపాటు నిర్విరామంగా నడిచిన రాహుల్‌.. రోడ్డుపక్కనే ఉన్న టీ స్టాల్‌ దగ్గర ఆగి.. టీ తాగారు. 


కాంగ్రెస్‌ లేని ‘కూటమి’ వృథా! : జైరాం రమేశ్‌

కాంగ్రెస్‌ లేని బీజేపీయేతర పార్టీల కూటమిని ఊహించలేమని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆయా పార్టీలు కూటమి కట్ట డం సాధ్యమేనని భావిస్తే వారు ‘పిచ్చివాళ్ల స్వర్గం’లో ఊయలలూగుతున్నారనే భావించాల్సి ఉంటుందని తీవ్రంగా స్పందించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆమ్‌ ఆద్మీపార్టీని బీజేపీకి బీ-టీమ్‌గా అభివర్ణించారు.

Updated Date - 2022-09-19T07:06:29+05:30 IST