కోట్లు రాకముందే క్యూ కట్టారు!

ABN , First Publish Date - 2022-09-25T07:58:18+05:30 IST

మొన్నటి వరకూ ఆర్థిక సమస్యలు. బతుకు దెరువు కోసం దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో లాటరీ తగలడంతో రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు.

కోట్లు రాకముందే క్యూ కట్టారు!

ఓనమ్‌ లాటరీ విజేత ఇంటికి జనం బారులు

సాయం చేయాలంటూ ఒకటే ఒత్తిడి

తిరువనంతపురం, సెప్టెంబరు 24: మొన్నటి వరకూ ఆర్థిక సమస్యలు.  బతుకు దెరువు కోసం దేశం విడిచి  వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో లాటరీ తగలడంతో రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఇక తన కష్టాలు తీరిపోతాయని, హాయిగా బతికేయచ్చని సంతోషంగా ఉన్న ఆయనకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా సాయం చేయాలంటూ జనం చుట్టుముడుతున్నారు. సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. లాటరీ తగిలిందన్న విషయం తెలియగానే అందరూ వాలిపోతున్నారు. ఐదు రోజుల క్రితం లాటరీలో 25 కోట్లు గెలుచుకున్న కేరళకు చెందిన ఆటో డ్రైవర్‌ అనూప్‌ కథ ఇది. టాక్స్‌లు పోను ఆయన చేతికి రూ.15.75 కోట్లు వస్తాయి. ఈ విషయం తెలియగానే తమకు సాయం చేయాలంటూ తిరువనంతపురంలోని ఆయన ఇంటికి జనం క్యూ కడుతున్నారు. ‘‘ఇంట్లో మేం బందీలుగా ఉన్నట్టుంది. బయటకు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. ఎక్కడికి పోయినా జనం చుట్టుముడుతున్నారు. నా కుమారుడికి ఆరోగ్యం బాగోలేదు. ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేకపోతున్నాం’’ అని అనూప్‌ వాపోయారు. తనకు ఇంకా డబ్బు అందలేదని, దయచేసి తన ఇంటికి రావద్దని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. 

Read more